Engineering Web Options:ఇంజనీరింగ్ ఆప్షన్ల ఎంపిక ప్రారంభం
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:28 AM
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం అడ్మిషన్ల భర్తీకి అనుమతిస్తూ జీవోలు విడుదల చేసిన తర్వాతే ప్రక్రియ ప్రారంభం కావాలి.
జీవోలు విడుదల చేయకముందే ప్రక్రియ
జాబితాలో మొత్తం 251 కాలేజీలు
అందులో కనిపించని ఎస్‌ఆర్‌ఎం, మిట్స్
ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం అడ్మిషన్ల భర్తీకి అనుమతిస్తూ జీవోలు విడుదల చేసిన తర్వాతే ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ జీవోలు ఇవ్వకముందే సాంకేతిక విద్యా శాఖ ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించింది. అప్పటికే జీవోలు విడుదల చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నా.. అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం రాత్రి వరకూ జీవోలు కనిపించలేదు. కాగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆప్షన్ల ఎంపిక ప్రారంభమైంది. మొత్తం 251 కాలేజీలు జాబితాలో కనిపిస్తున్నాయి.ఇందులో ప్రభుత్వ యూనివర్సిటీల కాలేజీలు, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి. అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం,మదనపల్లెలోని మిట్స్ కాలేజీలు జాబితాలో కనిపించకపోవడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు విద్యా సంస్థలకు త్వరలో డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించే అవకాశం ఉండటం వల్లే ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో పెట్టలేదని తెలిసింది.అయితే ఇది నిబంధనలకు విరుద్ధమనే వాదన వినిపిస్తోంది.డీమ్డ్ హోదా లభించే వరకూ అవి ప్రైవేటు విద్యా సంస్థలేనని,అప్పటి వరకూ కన్వీనర్ కోటా కింద సీట్లు ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయని విద్యారంగ నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా అమరావతిలో భూములు పొందిన ఎస్‌ఆర్‌ఎం ప్రైవేటు యూనివర్సిటీ సీట్లు ఇవ్వకపోవడంపై స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.కాగా మూడు యూనివర్సిటీల పరిధిలో సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు ప్రారంభించారు. జేఎన్‌టీయూ కాకినాడ కాలేజీలో ఏఐఎంఎల్‌లో 55 సీట్లు, ఎస్వీయూ ఇంజనీరింగ్ కాలేజీలో 132 సీఎ్‌సఈ సీట్లు, జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో 66 సీఎ్‌సఈ సీట్లు, 66 ఈసీఈ సీట్లు ఈ కోటాలో ఉన్నాయి. వీటికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించదు.కాగా ఆదివారం రాత్రి ఉన్నత విద్యా శాఖ ఇంజనీరింగ్ అడ్మిషన్ల భర్తీకి అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 212 ప్రైవేటు కాలేజీలు,24 యూనివర్సిటీ కాలేజీల్లో సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది.అలాగే ఇంజనీరింగ్ ఫీజులు 2024-25 విద్యా సంవత్సరంలో ఉన్న వాటినే కొనసాగిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది.