Share News

Srisailam Dam Safety: ఇలాగైతే డ్యాం నిర్వహణ ఎలా

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:45 AM

నిత్యం అందుబాటులో ఉంటూ శ్రీశైలం డ్యాం భద్రత పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన ఇంజనీర్ల నియామకంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ప్రాజెక్టు మెయింటినెన్స్‌ సర్కిల్‌ పరిధిలో...

Srisailam Dam Safety: ఇలాగైతే డ్యాం నిర్వహణ ఎలా

  • శ్రీశైలం ప్రాజెక్టులో ఇంజనీర్ల కొరత

  • వివిధ హోదాల్లో 59 ఇంజనీరింగ్‌ పోస్టులు

  • వీటిలో 43 ఖాళీ.. పని చేస్తున్నది 16 మందే

  • కీలకమైన ఎస్‌ఈ, ఈఈ స్థానాల్లో ఇన్‌చార్జులు

  • చివరకు ఆపరేటర్ల నియామకమూ లేదు

  • ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిపుణుల ఆవేదన

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

నిత్యం అందుబాటులో ఉంటూ శ్రీశైలం డ్యాం భద్రత పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన ఇంజనీర్ల నియామకంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ప్రాజెక్టు మెయింటినెన్స్‌ సర్కిల్‌ పరిధిలో డ్యాం, క్యాంప్స్‌ అండ్‌ బిల్డింగ్స్‌ నిర్వహణ కోసం 3 డివిజన్లు, 10 సబ్‌ డివిజన్లుగా విభజించారు. ఎస్‌ఈ, ముగ్గురు ఈఈలు, 11మంది డీఈఈలు, 44మంది ఏఈఈ/ఏఈలతో కలిపి 59 పోస్టులు ఇంజనీరింగ్‌ అధికారుల పోస్టులు మంజూరు చేశారు. మెయింటినెన్స్‌ డివిజన్‌ పరిధిలో 5 సబ్‌ డివిజన్లు ఉన్నాయి. వీటిలో ఐదుగురు డీఈఈలకు గాను ముగ్గురు, 20 మంది ఏఈఈలకు 8మందే పనిచేస్తున్నారు. క్యాంప్‌ అండ్‌ బిల్డింగ్స్‌ డివిజన్‌ పరిధిలోని ఐదు సబ్‌ డివిజన్లలో ఐదుగురు డీఈఈలకు ఇద్దరు, 18మంది ఏఈఈలకు ఇద్దరు ఉన్నారు. ప్రాజెక్టు సర్కిల్‌ పరిధిలో ఉన్న ఒక డీఈఈ పోస్టును భర్తీ చేశారు. కానీ ఆరుగురు ఏఈఈలకు గాను ఒక్కరినీ నియమించలేదు. మొత్తంగా 43 ఇంజనీరింగ్‌ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డ్యాం భద్రత, ప్రతిపాదనల తయారు, మరమ్మతులపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన ఎస్‌ఈ స్థానంలో కర్నూలు ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కర్నూలు నుంచి శ్రీశైలానికి మధ్య 180 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఘాట్‌ మార్గం కావడంతో కర్నూలు నుంచి వెళ్లి రావడానికి 10-11 గంటలకు పైగా సమయం పడుతుంది. దీంతో ఇన్‌చార్జి ఎస్‌ఈ వారంలో 2-3 రోజులకు మించి వెళ్లడం లేదని తెలుస్తోంది. డ్యాంలో పనిచేసే ఇంజనీర్లకు ఎస్‌ఈతో అవసరం పడితే వారే కర్నూలు రావలసి వస్తోంది. ఎస్‌ఈ తర్వాత కీలకమైన డ్యాం మెయింటినెన్స్‌ డివిజన్‌ ఈఈ పోస్టును భర్తీ చేయకపోగా.. నంద్యాల ఎస్‌ఆర్‌బీసీ డివిజన్‌ ఈఈ వేణుగోపాల్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.


నంద్యాల నుంచి కూడా శ్రీశైలానికి 160 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. వెళ్లి రావాలంటే పది గంటలకు పైగా సమయం పడుతుంది. కీలకమైన క్యాంప్‌ అండ్‌ బిల్డింగ్స్‌ డివిజన్‌ ఈఈగా ప్రాజెక్టు సర్కిల్‌ ఆఫీసులో డీఎస్ఈగా పనిచేసే సురేశ్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. అంటే ఎస్‌ఈ సహా ఏఈఈల వరకు వివిధ హోదాల్లో 59 మంది ఇంజనీరింగ్‌ అధికారులు పని చేయాల్సి ఉంటే వారిలో 16 మంది డీఈఈ, ఏఈఈలను మాత్రమే నియమించారు. ఎస్‌ఈ, ఈఈలను ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. వారంలో 2-3 రోజులు విజిటింగ్‌ అధికారుల్లా వచ్చి వెళ్తుండడంతో.. 2009 తరహాలో భారీ వరదలొస్తే డ్యాం పరిస్థితేమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గేట్లు, గ్యాలరీలు, వాటిలోని డ్రైనేజీ సిస్టమ్స్‌, క్రేన్లు, రీడింగ్‌, లిఫ్టులు, ఎలక్ట్రికల్‌ సప్లయ్‌, జనరేటర్ల నిర్వహణకు 45 నుంచి 50 మంది వరకు ఆపరేటర్లు అవసరం. ఇప్పుడు 12-15 మందే ఉన్నారు.


ఎన్నో పనులు సిద్ధం..

శ్రీశైలం డ్యాం శాశ్వత మరమ్మతులు, ప్రొటెక్టివ్‌ స్టీల్‌ సిలిండర్ల ఏర్పాటు కోసం కూటమి ప్రభుత్వం రూ.203.95 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.5.9 కోట్లతో డ్యాం ఇరువైపులా కొండ రాళ్లు జారిపడకుండా షాట్‌క్రీటింగ్‌ పనులు చేస్తున్నారు. 2009లో వరదలకు కొట్టుకుపోయిన అప్రోచ్‌ రోడ్డు (డ్యాం నిర్వహణ, మరమ్మతుల్లో అత్యంత కీలకమైన రోడ్డు) నిర్మాణం కోసం రూ.25.50 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. హైదరాబాద్‌కు చెందిన బీ అండ్‌ బీ సంస్థ పనులు దక్కించుకుంది. సీవోటీ అప్రూవల్‌ వచ్చింది. వారం పది రోజుల్లో పనులు మొదలు పెట్టి జూన్‌ ఆఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పాటు డ్యాం పునాదులకు ప్లంజ్‌పూల్‌ గొయ్యి నుంచి ప్రమాదం పొంచి ఉండడంతో.. డ్యాం రక్షణ దృష్ట్యా పూర్తిగా శిథిలమైన 62 ప్రొటెక్టివ్‌ స్టీల్‌ సిలిండర్లను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో దాదాపు రూ.180 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఇన్ని పనులను పెట్టుకుని.. 43 ఇంజనీరింగ్‌ పోస్టులను ఖాళీగా ఉంచి.. కీలకమైన పోస్టుల్లో ఇన్‌చార్జులను పెట్టడంతో రూ.వందల కోట్లతో చేపట్టే పనుల పర్యవేక్షణ ఎలా సాధ్యమనేది ప్రశ్న. రిటైరైన ఇంజనీర్ల స్థానంలో కొత్తవారిని నియమించకుండా ఎన్నాళ్లు ఇన్‌చార్జులతో బండి లాగిస్తారని నిపుణులు అడుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తెలుగు రాష్ట్రాల జీవనాడిగా ఉన్న శ్రీశైలం భద్రత, పర్యవేక్షణ దృష్ట్యా ఖాళీగా ఉన్న ఎస్‌ఈ, ఈఈ, డీఈఈ పోస్టులు పూర్తి స్థాయిలో, ఏఈఈ/ఏఈ పోస్టులు కనీసం సగమైనా భర్తీ చేయాలని సూచిస్తున్నారు.

ఖాళీ స్థానాల్లో ఇన్‌చార్జులను పెట్టాం

ఈ అంశంపై ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్‌ సీఈ కబీర్‌బాషా ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఐదు డీఈఈ, 34 ఏఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నమాట నిజమేనన్నారు. అయితే ఆ స్థానాల్లో ఇన్‌చార్జులను నియమించినట్లు తెలిపారు.

Updated Date - Dec 27 , 2025 | 04:46 AM