Engineer in Chief Srinivas: రూ.కోటికి తగ్గేదేలే
ABN , Publish Date - Aug 09 , 2025 | 03:24 AM
సబ్బవరపు శ్రీనివాస్...విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఈఎన్‌సీ.ఆయన ఏ కాగితం మీద సంతకం పెట్టాలన్నా రూ.కోటి చేతిలో పడాల్సిందే.
అడిగినంతా ఇస్తేనే ఫైల్‌పై సంతకం
లేకుంటే కొర్రీలతో కాంట్రాక్టర్లకు చుక్కలు
‘గిరిజన’ ఈఎన్‌ఎసీ శ్రీనివాస్ నిర్వాకం
అక్రమ సంపాదనంతా అమెరికాకు తరలింపు
22 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
విజయవాడ,ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): సబ్బవరపు శ్రీనివాస్...విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఈఎన్‌సీ.ఆయన ఏ కాగితం మీద సంతకం పెట్టాలన్నా రూ.కోటి చేతిలో పడాల్సిందే.తాను చెప్పిందే రేటు. ఇందులో మరో మాటే లేదు.అడిగినంత ఇచ్చుకుంటే ఓకే.లేకపోతే కొర్రీల మీద కొర్రీలు వేసి కాంట్రాక్టర్లకు చుక్కలు చూపిస్తారు. శ్రీనివా్‌సకు ఇద్దరు కుమారులు. వారిలో ఒకరు అమెరికాలో ఉంటున్నారు.కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసి న లంచం సొమ్మును అమెరికాలో ఉంటున్న కుమారుడి వద్దకు పంపుతున్నట్టు విశ్వసనీయం గా తెలిసింది.గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులతో ఈయనకు సత్సంబంధాలు ఉన్నాయి.కాంట్రాక్టర్లను ఎంత వేధించినా అడిగే వారు లేకపోవడంతో ఇంజనీరింగ్ విభాగంలో తిరుగులేని అధికారిగా మారారు.ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్న పనిని మరో కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి రూ.కోటికి తక్కువ కాకుండా వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే పనిని మళ్లీ పాత కాంట్రాక్టర్‌కు అప్పగించాలన్నా రూ.కోటి ఇవ్వాల్సిందే.గతంలో ఆయనపై విచారణ చేసిన విజిలెన్స్ కమిషన్.. శ్రీనివా్‌సకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేసింది.ఈఎన్‌సీ పోస్టుకు ఆయన అనర్హుడని అందులో స్పష్టం చేసింది. అయినా నాటి పాలకులు ఏరికోరి మరీ శ్రీనివా్‌సకు పదవిని కట్టబెట్టారు. తాను డిమాం డ్ చేసిన మొత్తం ఇస్తేనే పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలుపుతానని కొద్ది నెలల క్రితం ఉత్తరాంధ్రకు చెం దిన ఓ కాంట్రాక్టర్‌ను వేధించాడు. ఆయన అధికార పార్టీ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి విషయం చెప్పి కన్నీరుమున్నీరయ్యారు. ఆ నేత ఈఎన్‌సీకి ఫోన్ చేసి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పనితీరు ఇదేవిధంగా ఉంటే చాలా ఇబ్బందులు పడతారని శ్రీనివాస్‌ను హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచా రం. ఇదిలాఉండగా, కాంట్రాక్టర్ నుంచి రూ.25లక్షలు లంచం తీసుకున్న శ్రీనివా్‌సను పట్టుకున్న అధికారులు విశాఖపట్నంలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు శుక్రవారం కొనసాగాయి. శ్రీనివా్‌సను ఏసీబీ అధికారులు శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది.అనంతరం ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.