Share News

AP Liquor Scam: రంగంలోకి ఈడీ

ABN , Publish Date - Sep 19 , 2025 | 04:26 AM

వేల కోట్ల మద్యం స్కామ్‌లో ఎట్టకేలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వ ‘సిట్‌’ నుంచి సమాచార సేకరణకే పరిమితమైన ఈడీ...

AP Liquor Scam: రంగంలోకి ఈడీ

  • ఒకేరోజు ఐదు రాష్ట్రాల్లో 20చోట్ల సోదాలు

  • మద్యం స్కామ్‌లో మనీ లాండరింగ్‌పై నజర్‌

  • రాజ్‌ కసిరెడ్డి భార్యకు చెందిన ‘ఆరేట్‌’లో తనిఖీలు

  • నగల దుకాణాలు, పండ్ల వ్యాపారాలు, రవాణా కంపెనీలతో ముడిపడిన స్కామ్‌

  • నకిలీ ఇన్వాయి్‌సలు, డొల్ల కంపెనీలపై ఆరా

  • మే నెలలో రాజ్‌ కసిరెడ్డిని ప్రశ్నించిన ఈడీ

  • నాలుగు నెలలు పూర్తిస్థాయిలో కసరత్తు

  • సేకరించిన ఆధారాల మేరకు సోదాలు

  • అనూహ్య పరిణామంతో జగన్‌ అప్రమత్తం!

  • సీనియర్‌ న్యాయవాదులతో చర్చలు

నగల షాపులు, పండ్ల ఎగుమతి గోడౌన్లు, ప్యాకేజింగ్‌ యూనిట్లు, వైద్య సేవలందించే సంస్థలు... ఒకదానితో మరొక దానికి సంబంధంలేని వ్యాపార సంస్థలివి. కానీ... ఇవన్నీ ‘మద్యం ముడుపుల’తో ముడిపడ్డాయి. గురువారం తెల్లవారుజాము నుంచి దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఈడీ జరిపిన సోదాల్లో వీటి మధ్య లింకులు బయటపడ్డాయి.

అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వేల కోట్ల మద్యం స్కామ్‌లో ఎట్టకేలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వ ‘సిట్‌’ నుంచి సమాచార సేకరణకే పరిమితమైన ఈడీ... ఇప్పుడు క్షేత్రస్థాయిలో సోదాలు మొదలుపెట్టింది. గురువారం ఒకే రోజు, ఒకే సమయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో సోదాలు జరిపింది. జగన్‌ హయాంలో జరిగిన రూ.3500 కోట్ల మద్యం స్కామ్‌పై ‘సిట్‌’ ఇప్పటికే మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. జగన్‌ సన్నిహితులైన చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డి సహా కీలక నిందితులను అరెస్టు చేసింది. ఈ స్కామ్‌లో భాగంగా భారీగా షెల్‌ కంపెనీలను సృష్టించి, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ‘సిట్‌’ గుర్తించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని సహా కీలక నిందితులను అరెస్టు చేసింది. ఈ స్కామ్‌లో భాగంగా భారీగా షెల్‌ కంపెనీలను సృష్టించి, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ‘సిట్‌’ గుర్తించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇదివరకే ఈడీతో పంచుకుంది. ఈ నేపథ్యంలోనే ఈడీ నేరుగా రంగంలోకి దిగింది.


హైదరాబాద్‌లో... ఏ-1 రాజ్‌ కసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యా రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న ఆరేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె స్‌లో సోదాలు జరిపింది. అదే సంస్థలో మరో డైరెక్టర్‌గా ఉన్న తీగల విజయేందర్‌ రెడ్డితో రాజ్‌ కసిరెడ్డి ఏర్పాటు చేయించిన యూవీ డిస్టిల్లరీస్లోనూ తనిఖీలు నిర్వహించింది. నకిలీ ఇన్వాయి్‌సల కోసం మద్యం ముఠా సృష్టించిన ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌, వెంకటేశ్వర ప్యాకేజింగ్‌లాంటి కంపెనీల అసలు గుట్టును ఈడీ వెలికి తీసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోనే వెస్ట్‌ మారేడ్‌పల్లి వెల్లింగ్టన్‌ ఎన్‌క్లేవ్‌లో ఉన్న బూరుగు రమేశ్‌, ఆయన కుమారుడు విక్రాంత్‌ నివాసాల్లో ఏడు గంటలకు పైగా సోదాలు జరిపింది. మహదేవ్‌ జువెలర్స్‌తోపాటు రాజశ్రీ ఫుడ్స్‌లో విక్రాంత్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. హైదరాబాద్‌లోనే వెంకటేశ్వర ప్యాకేజింగ్‌, సువర్ణదుర్గ బాటిల్స్‌, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌, ఎన్‌ఆర్‌ ఉద్యోగ్‌ ఎల్‌ఎల్‌పీ తదితర సంస్థల్లోనూ సోదాలు జరిగాయి.


‘సిట్‌’ నుంచి సమాచారం...

మద్యం స్కామ్‌పై ‘సిట్‌’ లోతుగా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే... పొరుగు రాష్ట్రాల కంపెనీలు, షెల్‌ కంపెనీలు, హవాలా లింకులు అనేకం బయటపడ్డాయి. ఎక్సైజ్‌ విధానం దుర్వినియోగం, లిక్కర్‌ బ్రాండ్ల మానిప్యులేషన్‌, ముడుపుల స్వీకరణ మొదలుకొని మద్యం ముడుపుల వెనుక కీలకంగా ఉన్న మనీ రూటింగ్‌ను ‘సిట్‌’ పసిగట్టింది. ఈ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించిన మాజీ సీఎం జగన్‌ ఐటీ సలహాదారు రాజ్‌ కసిరెడ్డి(ఏ-1) రిమాండ్‌ రిపోర్టులోనే మనీలాండరింగ్‌ అంశాన్ని ప్రస్తావించింది. దీనిపై ఈడీ అధికారులు స్పందించి ‘సిట్‌’ అధిపతి రాజశేఖర్‌ బాబు(విజయవాడ పోలీస్‌ కమిషనర్‌)కు మే మొదటి వారంలో లేఖ రాశారు. లిక్కర్‌ స్కామ్‌ కేసు ఎఫ్‌ఐఆర్‌ కాపీతోపాటు అప్పటి వరకూ దర్యాప్తులో లభించిన ఆధారాలు అందజేయాల్సిందిగా కోరారు. ఈ వివరాలు అందిన అనంతరం... పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌) సెక్షన్ల కింద మే 24న ఈసీఐఆర్‌ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిపోర్ట్‌) నమోదు చేశారు. విజయవాడ జైల్లో ఉన్న రాజ్‌ కసిరెడ్డిని మూడు రోజులపాటు కోర్టు అనుమతితో ప్రశ్నించారు. కమీషన్లు దండుకునేందుకు వీలుగా ఎక్సైజ్‌ పాలసీని రూపొందించడం, ముడుపులను మధ్యవర్తుల ద్వారా మనీ రూటింగ్‌ చేయడం వంటి వివరాలను రాబట్టారు. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టి నాలుగు నెలలపాటు పలు ఆధారాలు సేకరించి గురువారం తెల్లవారుజాము నుంచి సోదాలు జరిపారు.


వందల కోట్ల హవాలా..

‘‘మాది మద్యం వ్యాపారం. మా బ్రాండ్‌ మార్కెట్‌ పెంచుకోవడానికి బంగారం కాయిన్లు కొన్నాం’ అంటూ కట్టుకథలు చెప్పిన మద్యం వ్యాపారులు ఈడీ విచారణలో అసలు గుట్టు విప్పారు. బంగారం కొన్నట్లు చూపించిన బిల్లులన్నీ నకిలీవేనని, ఉత్తుత్తి ఇన్వాయి్‌సలు చూపించి మద్యం ముడుపుల్ని వైట్‌ మనీగా మార్చుకున్నట్లు తేలింది. మరింత లోతుగా ఆరా తీయడంతో హవాలా రూపంలో దుబాయ్‌, హాంకాంగ్‌ మీదుగా ఆఫ్రికాకు తరలించి అక్కడ మైనింగ్‌ వ్యాపారం చేసినట్లుగా చూపించి, అదే డబ్బును తిరిగి భారత్‌కు తీసుకురావాలని ప్లాన్‌ వేశారు. అయితే అక్కడ మైనింగ్‌ వ్యాపారమేదీ లేదని, ఉత్తుత్తి లావాదేవీలు చూపించి, ముడుపుల సొమ్మును వైట్‌ చేయించుకునేందుకే ఈ స్ర్కిప్టు రాశారని ఈడీ గుర్తించింది.


కీలక ఆధారాలు లభ్యం...

మనీ లాండరింగ్‌కు సహకరించిన వ్యాపారుల గోదాములలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. నకిలీ ఇన్వాయి్‌సలు, కొనుగోలు చేయని బిల్లులు, ఆయా వ్యాపార సంస్థల ఆడిట్‌ వివరాల రికార్డులు, నగదు లావాదేవీలు, ఇతర కీలక డాక్యుమెంట్లు, డిజిటల్‌ డేటాను స్వాధీ నం చేసుకున్నట్లు తెలిసింది. డొల్ల కంపెనీల లావాదేవీలు, తప్పుడు బిల్లుల పూర్తి ఆధారాలను సేకరించినట్లు సమాచారం.


చెన్నైలో..

చెన్నైలోని ది ఇండియా ఫ్రూట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మోహన్‌లాల్‌ జువెలర్స్‌ (చెన్నై)లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. మద్యం రవాణా సంస్థ ‘సిగ్మా’ ప్రధాన కార్యాలయమున్న నోయిడాలోనూ తనిఖీలు జరిపారు. అప్పట్లో డిస్టిలరీల నుంచి మద్యం డిపోలకు, దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్టు ‘సిగ్మా’కు దక్కింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా అయిన మద్యం పరిమాణం, ప్రభుత్వానికి జమ అయిన నగదు లెక్కలు తేల్చడంపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం.


జగన్‌ అప్రమత్తం...

మద్యం స్కామ్‌లో అనూహ్యంగా ఈడీ రంగంలోకి దిగి... ఐదు రాష్ట్రాల్లో సోదాలు జరపడంతో ‘తాడేపల్లి క్యాంపు’ ఉలిక్కి పడినట్లు సమాచారం. తాజా పరిణామాలపై కొందరు సీనియర్‌ న్యాయవాదులతో జగన్‌ సమావేశమై సమీక్షించినట్లు తెలిసింది.

రైతు ఇంట్లో ‘కంపెనీ’

ఇది... తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కొత్తకాలువ గ్రామానికి చెందిన రైతు అంకిరెడ్డి ఇల్లు! లెక్క ప్రకారం... ఈ చిరునామాలో ఒక కంపెనీ ఉండాలి. రికార్డుల్లో ‘అంకిరెడ్డి’ పేరుతో ఇదే ఇంట్లో ఒక కంపెనీ ఏర్పాటైంది. ఈ కంపెనీ మద్యం కుంభకోణంతో సంబంధమున్న ఒక నేత బినామీదనే సమాచారంతో... గురువారం ముగ్గురు ఈడీ అధికారులు దీనిని వెతుక్కుంటూ వచ్చారు. గూగుల్‌ మ్యాప్స్‌ సహాయంతో అక్కడికి చేరుకున్నారు. తీరా చూస్తే... అక్కడ ఎలాంటి కంపెనీ లేదు! ఈడీ సేకరించిన సమాచారం ప్రకారం... కంపెనీ యజమాని పేరు అంకిరెడ్డే! కానీ... ఆధార్‌ ప్రకారం ఇక్కడున్న అంకిరెడ్డి తండ్రి పేరు సరిపోలలేదు. తమ పూర్వీకుల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నామని అంకిరెడ్డి స్పష్టం చేశారు. కొన్ని నెలల కిందటే తాను గుండె ఆపరేషన్‌ చేయించుకున్నాని తెలిపారు. ఆయన నుంచి ప్రాథమిక వివరాలు సేకరించి ఈడీ అధికారులు వెళ్లిపోయారు. తన ఇంటి చిరునామాతో బోగస్‌ కంపెనీ సృష్టించినట్లు తనకు తెలియదని అంకిరెడ్డి తెలిపారు. ఈడీ అధికారుల రాకతో ఆందోళనకు గురయ్యానని చెప్పారు.

- తిరుపతి (నేరవిభాగం)

Updated Date - Sep 19 , 2025 | 04:29 AM