Enforcement Directorate: జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో.. దాల్మియా సిమెంట్స్ ఆస్తుల జప్తునకు ఓకే
ABN , Publish Date - Sep 26 , 2025 | 08:14 AM
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ (భారత్) సంస్థ ఆస్తులను జప్తు చేయడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్...
ఈడీ అడ్జుకేటింగ్ అఽథారిటీ సమర్థన
ఈ ఏడాది మార్చి 31న రూ.793 కోట్ల ఆస్తులు జప్తు చేసిన డైరెక్టరేట్
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ (భారత్) సంస్థ ఆస్తులను జప్తు చేయడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అడ్జుకేటింగ్ అథారిటీ సమర్థించింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వపరంగా పలు ప్రైవేటు కంపెనీలు, సంస్థలకు ‘మేళ్లు’ జరగడం.. లబ్ధిపొందిన ఆయా సంస్థలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా క్విడ్ ప్రోకు పాల్పడ్డాయని సీబీఐ చార్జిషీట్లు కూడా నమోదు చేయడం తెలిసిందే. ముఖ్యమంత్రిగా వైఎస్ పలు సంస్థలకు అందించిన లబ్ధి.. ఆయన కుటుంబసభ్యులకు ప్రయోజనం కలిగించిందని, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు ప్రవహించాయని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది.
ఇలా లబ్ధిపొందిన కంపెనీల్లో దాల్మియా సిమెంట్స్ కూడా ఉంది. వైఎస్ జమానాలో కడప జిల్లాలో 407 హెక్టార్ల సున్నపురాయి నిక్షేపాలను ఆ సంస్థ లీజుకు దక్కించుకుంది. ఇందుకు ప్రతిఫలంగా జగన్మోహనరెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. మనీలాండరింగ్ కూడా జరిగిందన్న ఆరోపణలతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ ఏడాది మార్చి 31న ఆ కంపెనీకి చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఇందులో రూ.377.26 కోట్ల విలువైన భూములు కూడా ఉన్నాయి. ఈడీ చర్యను దాల్మియా.. అడ్జుకేటింగ్ అథారిటీలో సవాల్ చేయగా.. లోతుగా పరిశీలించిన అథారిటీ.. జప్తును సమర్థిస్తూ మంగళవారం నిర్ణయం వెలువరించింది. అయితే జప్తు నిర్ణయాన్ని అడ్జుకేటింగ్ అథారిటీ సమర్థించినా.. తమ సంస్థ ఆర్థిక లావాదేవీలకు, వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకమూ ఉండబోదని స్టాక్ ఎక్స్ఛేంజీకి దాల్మియా (భారత్) వివరణ ఇచ్చింది.