Police Arrest: దేవదాయ శాఖ ఈవో చేతివాటం
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:14 AM
దేవదాయశాఖ ఈవో చేతివాటం ప్రదర్శించాడు. అమ్మవారి వెండి వస్తువులు, ఆభరణాలు, చీరలు కాజేసేందుకు ప్రయత్నించాడు.
అమ్మవారి ఆభరణాలు, చీరలు తరలిస్తూ పట్టుబడిన వైనం
కదిరి/పుట్టపర్తి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): దేవదాయశాఖ ఈవో చేతివాటం ప్రదర్శించాడు. అమ్మవారి వెండి వస్తువులు, ఆభరణాలు, చీరలు కాజేసేందుకు ప్రయత్నించాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. మురళీకృష్ణ శ్రీసత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలోని ప్రసిద్ధ ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయం, నల్లచెరువు మండలంలోని పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి తదితర సమూహ ఆలయాల ఈవోగా పనిచేస్తున్నారు. ఆదివారం ఆయన తన భార్యతో కలిసి ఆలయంలోని వెండి ఆభరణాలు, చీరలు ఇతర సామగ్రిని ఆటోలో తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. కదిరి అప్‌గ్రేడ్ పోలీసులు అక్కడికి చేరుకుని ఈవో దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు, చీరలు స్వాధీనం చేసుకున్నారు. దేవదాయ శాఖ ఉద్యోగి ప్రసాద్ ఫిర్యాదు మేరకు ఈవోపై కేసు నమోదు చేశారు. ఈఓను సస్పెండ్ చేయాలంటూ దేవదాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక విచారణలో ఈఓ చోరీ చేసినట్లు తేలడంతో పోలీసులు అరెస్టు చేశారు.