Share News

AP Govt: అమరావతి మహిళలకు ఉపాధి ‘లక్ష’యం!

ABN , Publish Date - Dec 10 , 2025 | 04:56 AM

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన ఆ ప్రాంత రైతులు, ఆ భూములపై ఆధారపడ్డ నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది.

AP Govt: అమరావతి మహిళలకు ఉపాధి ‘లక్ష’యం!

  • 29 గ్రామాల నుంచి లక్ష మందికి అవకాశం

  • సీఆర్‌డీఏలో సోషల్‌ డెవల్‌పమెంట్‌ సెల్‌ ఏర్పాటు

  • సామర్థ్యాన్నిబట్టి నైపుణ్యాభివృద్ధి శిక్షణ

  • ఎవరూ ఖాళీగా ఉండకూడదు..

  • కోరుకున్నవారికి కోరుకున్న పని

  • భూమి లేని నిరుపేదలపై ప్రత్యేక దృష్టి

  • (అమరావతి-ఆంధ్రజ్యోతి)

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన ఆ ప్రాంత రైతులు, ఆ భూములపై ఆధారపడ్డ నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. రాజధాని ఆవిర్భావ సమయంలో భూమి లేని కుటుంబాలకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్‌ అమరావతి రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా ఆ ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతులతో పాటు భూమిలేని నిరుపేదలు సైతం తీవ్రంగా నష్టపోయారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి 25 పంచాయతీల్లోని 29 గ్రామాల్లో లక్ష మందికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం సీఆర్‌డీఏలో సోషల్‌ డెవల్‌పమెంట్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దానికి డైరెక్టర్‌గా రిటైర్డ్‌ ఇండియన్‌ పోస్టల్‌ అధికారి కల్నల్‌ రాములును నియమించారు. ఈయన గతంలో సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ సెక్రటరీగా పనిచేసి గురుకులాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు.


నిరుద్యోగ యువతకు శిక్షణ

రాజధాని గ్రామాల్లో నూరుశాతం అక్షరాస్యత సాధించాలని సంకల్పించారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతను గుర్తించి వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నారు. ఎస్‌ఆర్‌ఎం, వీఐటీ యూనివర్సిటీల్లో శిక్షణ అందిస్తున్నారు. సైబర్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, జీఎ్‌సటీల మీద నాలుగు బ్యాచ్‌లకు శిక్షణ ఇస్తున్నారు. దీంతో పాటు వీఐటీలో 109 మందికి హౌస్‌ కీపింగ్‌ మీద శిక్షణ అందించారు. గార్డెనింగ్‌పై శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేసి వెలగపూడిలోని సచివాలయం సమీపంలో నర్సరీల దగ్గర గార్డెనింగ్‌ శిక్షణ ప్రారంభించారు. నిరుద్యోగులకు ఆయా పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా అమరావతి ప్రాంతంలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికుల కుటుంబాలపై కూడా సీఆర్‌డీఏ సోషల్‌ డెవల్‌పమెంట్‌ విభాగం దృష్టి సారించింది. 14 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించి చదివించేందుకు చొరవ తీసుకుంది.


సీఆర్‌డీఏ కార్యాలయంలో అమరావతి అమ్మవంట కౌంటర్‌!

అమరావతి ప్రాంతంలో 19-50 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళలు 50 వేల మంది ఉన్నట్లు గుర్తించారు. ముందుగా ఉండవల్లి రూరల్‌, అర్బన్‌, మందడం, ఎర్రబాలెం, అనంతవరం గ్రామాల్లో 275 మంది మహిళలను గుర్తించి వారికి స్వచ్ఛంద సంస్థ సహకారంతో 26 రోజులు తృణధాన్యాలతో వంటల తయారీపై శిక్షణ అందించారు. ‘అమరావతి అమ్మవంట’ పేరిట ఆయా గ్రామాలకు చెందిన శిక్షణ పొందిన మహిళలు 30 రకాల తినుబండారాలు తయారుచేసి సీఆర్‌డీఏ కార్యాలయంలో ఒక కౌంటర్‌ పెట్టి విక్రయిస్తున్నారు. ముఖ్యంగా 15 రకాల వంటకాలపై ప్రత్యేక శిక్షణ అందించి వాటికి ప్రమాణాలు కూడా నిర్దేశించారు. ఈ మహిళలందరికీ చిన్న తరహా పరిశ్రమల్లో ఉద్యమంలా రిజిస్టర్‌ చేస్తున్నారు. వారు తయారుచేసే ఆహార ఉత్పత్తులకు లైసెన్స్‌ కోసం ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్ఎస్ ఏఐ)కు దరఖాస్తు చేసేందుకు సీఆర్‌డీఏ అధికారులు కృషి చేస్తున్నారు.

వినూత్నం.. ఇంటి వంటతో ఉపాధి!

కేవలం వంటలోనే నైపుణ్యముండి బయటికి వెళ్లి ఉపాధి అవకాశాలు దక్కించుకోలేని మహిళలకు కూడా వినూత్న అవకాశాలను కల్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లోను, వీఐటీ యూనివర్సిటీ విద్యార్థులకూ మధ్యాహ్నం భోజనం తయారుచేసి అందించే ఏర్పాట్లు చేశారు. ఒక్కో మహిళ తన ఇంట్లో వంట వండి పది మంది పిల్లలకు మధ్యాహ్నం భోజనం అందించేలా కొత్త అవకాశాలు కల్పించారు. దీంతో ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు ఆ భోజనం ఖర్చు ఈ మహిళలకు చెల్లిస్తారు. దీంతో పలువురు అమరావతి మహిళలు ఉపాధి పొందుతున్నారు. దీంతో పాటు కార్యాలయాలకు పండ్లు కట్‌ చేసి ఫ్రూట్‌ సలాడ్‌లను, రాగి జావ, ఇతర తృణ ధాన్యాల జావ తయారుచేసి అందిస్తున్నారు. తక్కువ ధరకు అందించడం ద్వారా విరివిగా విక్రయిస్తున్నారు. అమరావతిలో ఏ పనిచేయగలిగిన ఏ ఒక్కరూ కూడా ఖాళీగా ఉండరాదన్న లక్ష్యంతో సోషల్‌ డెవల్‌పమెంట్‌ విభాగం పనిచేస్తోంది.


కొత్తగా మరో 5వేల హెల్త్‌కార్డులు

మొదట్లో అమరావతి ప్రాంతంలో ఏపీఎల్‌, బీపీఎల్‌ అనే తేడా లేకుండా ప్రభుత్వం 38 వేల ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేసింది. అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా 5 వేల కుటుంబాలు వచ్చాయి. వారికి ఆరోగ్యశ్రీ కార్డులు లేవని గుర్తించారు. వారందరికీ ఆరోగ్యశ్రీ కార్డులిచ్చేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అంచెలంచెలుగా రాజధాని ప్రాంతంలో అమలు చేయాలని నిర్ణయించారు. సీఆర్‌డీఏలో సోషల్‌ డెవల్‌పమెంట్‌ విభాగం ద్వారా అమరావతి ప్రాంతంలో అనేక అనేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలవుతుండటంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Dec 10 , 2025 | 04:58 AM