Share News

National President K. Laxman: సంచార జాతుల అభివృద్ధే బీజేపీ లక్ష్యం

ABN , Publish Date - Aug 31 , 2025 | 04:49 AM

సంచా ర జాతులకు లబ్ధి చేకూర్చి, వారికి అభివృద్ధి ఫలాలను అందజేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సంచార, అర్ధ సంచార జాతుల సంక్షేమాన్ని విస్మరించాయని ఆరోపించారు.

National President K. Laxman: సంచార జాతుల అభివృద్ధే బీజేపీ లక్ష్యం

  • నేటికీ వెనుకబడిన సంచార జాతులు: ఆర్‌ కృష్ణయ్య

  • ఘనంగా విముక్తి దినోత్సవం

విజయవాడ సిటీ, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): సంచా ర జాతులకు లబ్ధి చేకూర్చి, వారికి అభివృద్ధి ఫలాలను అందజేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సంచార, అర్ధ సంచార జాతుల సంక్షేమాన్ని విస్మరించాయని ఆరోపించారు. ఆ కారణంగా నేటికీ సమాజంలో వారు వెనుకబడి ఉన్నారన్నారు. విజయవాడలో శనివారం సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి లక్ష్మణ్‌ మాట్లాడుతూ గరీబీ హటావో అని నినాదాలు చేసే కాంగ్రెస్‌ నాయకులు గతంలో సంచార జాతులకు ఏమీ చేయలేదన్నారు. కులం, మతం, ప్రాంతం, భాష పేరుతో దేశంలో చీలికలు తీసుకొచ్చేందుకు రాహుల్‌ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే సంచార జాతులపై దేశవ్యాప్తంగా అధ్యయనం జరిగిందన్నారు. సంచార జాతులను ఆదుకున్న మొట్టమొదటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే అన్నారు. విద్య, ఉద్యోగాల్లో సంచార, అర్ధ సంచార జాతులకు మోదీ ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. 5 లక్షల సంచార జాతులకు ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రకరకాల పేర్లతో వీరిని పిలుస్తున్నామని, ఈ పేర్లను మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. వీరి సంక్షేమం కోసం ఈ నెల 31న అద్భుతమైన రాయితీలను కేంద్రం ప్రకటించబోతోందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ మా ట్లాడుతూ రాష్ట్రంలోని సంచార జాతుల సంక్షేమ, అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. వారికి కేంద్రం కేటాయించిన నిధులను వైసీపీ నాయకులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. త్వరలో వీరికి గుర్తింపు(ఎన్‌టీ, డీఎన్‌టీ) సర్టిఫికెట్‌ల ను ఇస్తామని తెలిపారు.


కలెక్టర్ల వద్దకు తీసుకెళ్లి తామే స్వయంగా సర్టిఫికెట్‌లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దేవాలయాల్లో ప్రదర్శనలు చేసేలా, తిరుమల బ్రహ్మోత్సవాల్లో వీరి నృత్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ పాకా సత్యనారాయణ మాట్లాడుతూ.. 1939 జనాభా లెక్కల్లో వీరు లేకపోవడంతో నేటికీ అట్టడుగున ఉండిపోయారన్నారు. రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార జాతుల సమస్యల ను కేంద్రానికి చేర్చడమే బీజేపీ రాష్ట్ర నాయకుల లక్ష్యమన్నారు. ఎంపీ ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఎంతో మంది సంచార జాతులు ఉన్నారని, వారంతా నేటికీ ఆర్థికంగా సామాజికంగా ఎంతో వెనుకబడి ఉన్నారని తెలిపారు. దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్న వీరికి ప్రజలందరూ రుణపడి ఉండాలన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా వీరు ఇంకా వెనుకబడిపోయారని, ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోనే వీరికి అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని తెలిపారు. తొలుత సంచార జాతుల విన్యాసాల నడుమ బీజేపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.


ఆకట్టుకున్న ప్రదర్శనలు

తొలుత గంగిరెద్దుల, దొమ్మర్ల, పంబల విన్యాసాలు నడుమ బీజేపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బాలసంతు, బండార, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెద్దుల, జంగం, జోగి, కాటికాపరి, కొర్చ, మొండివారు, పిచ్చిగుంట్ల, పాముల, పార్ది, పంబల, దమ్మాలి, వీరముష్టి, గూడల, కంజార, కాప్మారే, మొండిపట్ట, నొక్కార్‌, పరికి, మగ్గుల, యాట, చోపేమారి, కైకాడి, జోషినందివాలా, మందుల, కునపులి, పట్రా, రాజనాల, కాసికపాడి జాతులవారు చేసిన ప్రదర్శలు, పాటలు ఆకట్టుకున్నాయి. పలు రకాల డప్పు వాయిద్యాలు, సన్నాయిలు, ఇత ర సంగీత సాధనాలతో తరతరాల వారసత్వంగా వస్తున్న కట్టుబాట్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, విష్ణుకుమార్‌రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 04:53 AM