Fruit Plantation: లక్ష ఎకరాల్లో ఉపాధి ఉద్యానవనాలు
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:43 AM
ఉపాధి నిధులతో పేద రైతుల పొలాల్లో లక్ష ఎకరాల్లో ఉద్యానవన పంటలు వేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంకల్పించింది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 25 వేల ఎకరాల్లో...
పేద రైతుల పొలాల్లో పండ్ల తోటలు
నేడు 25 వేల ఎకరాల్లో నాటేందుకు సన్నాహాలు
అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఉపాధి నిధులతో పేద రైతుల పొలాల్లో లక్ష ఎకరాల్లో ఉద్యానవన పంటలు వేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంకల్పించింది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 25 వేల ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆ శాఖ కమిషనర్ కృష్ణతేజ లేఖలు రాశారు. సీజన్‌ను బట్టి ఉద్యానవన పంటలు వేసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని కోరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. మొక్కలు కొనుగోలు చేయడం ఇప్పటికే పూర్తయింది. ఏయే జిల్లాల్లో ఎన్ని మొక్కలు నాటాలో లక్ష్యాలు నిర్దేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో 20 శాతం భూమిలో ఉద్యానవన పంటలు వేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 0.25 ఎకరాల నుంచి 5 ఎకరాల భూమి కలిగిన జాబ్ కార్డుదారులకు ఉద్యానవన పంటలు పెంచుకునేందుకు ఉపాధి నిధులను మంజూరు చేస్తారు. ఆయా రైతుల పొలాల్లో వేసే మొక్కల రకాలను బట్టి రేటు, వాటికి వేసే ఎరువులు, నిర్వహణ వ్యయం తదితర ఖర్చులను ఉపాధి నిధుల నుంచి అందిస్తారు.