Court Criticizes Delay: ఉద్యోగం ఇస్తామని.. ఇవ్వకపోతే ఎలా?
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:52 AM
ప్రాజెక్టుల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన కోసం భూములు తీసుకొనేటప్పుడు ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీని ఏళ్ల తరబడి అమలు చేయకపోవడాన్ని హైకోర్టు...
భూమి తీసుకునేప్పుడు చూపించే ఉత్సాహం హామీలు నెరవేర్చేందుకు ఎందుకు ఉండట్లేదు?
విద్యుదుత్పత్తి సంస్థనుద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు
ప్రాజెక్టుల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన కోసం భూములు తీసుకొనేటప్పుడు ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీని ఏళ్ల తరబడి అమలు చేయకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. భూములు తీసుకునేప్పుడు చూపే ఉత్సాహం, ఉద్యోగాలు ఇచ్చేప్పుడు ఎందుకు చూపడం లేదని ప్రశ్నించింది. జీవనాధారమైన భూమిని ఇచ్చిన వారికి ఉద్యోగం ఇవ్వకుంటే వారు ఎలా జీవిస్తారని నిలదీసింది. ఇది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును హరించడమేనని వ్యాఖ్యానించింది. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్‌టీపీసీ)లో భాగంగా రైల్వే లైన్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన కడపజిల్లా, ముద్దనూరు గ్రామానికి చెందిన రామసుబ్బయ్య కుమారుడు రాజశేఖర్‌ను జూనియర్ ప్లాంట్ అటెండెంట్ పోస్టుకు పరిగణనలోకి తీసుకోవాలని 2023లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ దాఖలు చేసిన అప్పీల్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. రామసుబ్బయ్య 1992లో ఆర్‌టీపీసీ ఫేజ్-1 రైల్వేట్రాక్ కోసం తనకు చెందిన 60 సెంట్ల భూమిని ఇచ్చారు. ఆ సమయంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థ.. భూమి ఇచ్చిన రామసుబ్బయ్యకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ఏళ్లుగడిచినా సదరు హామీ అమలుకాకపోవడంతో 2022లో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు బదులు కుమారుడు రాజశేఖర్‌కు అయినా ఉద్యోగం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ పోస్టుకు రామసుబ్బయ్య కుమారుడి పేరును పరిగణనలోకి తీసుకోవాలని 2023లో తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అదే ఏడాది ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ ఎండీ హైకోర్టులో అప్పీల్ వేశారు. సోమవారం జరిగిన విచారణలో ఎండీ తరఫున అడ్వొకేట్ జనరల్, పిటిషనర్ తరఫున న్యాయవాది జీవీ శివాజీ వాదనలు వినిపించారు.