Share News

ఉద్యోగుల జీతభత్యాల గోల్‌మాల్‌

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:30 PM

ఆళ్లగడ్డ సబ్‌ట్రెజరీ కార్యాలయంలో జీతభత్యాల వ్యవహారంలో గోల్‌మాల్‌ జరిగినట్లు జిల్లా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    ఉద్యోగుల జీతభత్యాల గోల్‌మాల్‌
ఆళ్లగడ్డ లోని సబ్‌ ట్రెజరీ కార్యాలయం

రూ. కోటిన్నర స్వాహా

పీహెచసీ యూడీసీపై అనుమానం

ఆళ్లగడ్డ, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ సబ్‌ట్రెజరీ కార్యాలయంలో జీతభత్యాల వ్యవహారంలో గోల్‌మాల్‌ జరిగినట్లు జిల్లా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం ఆయా ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. ఆళ్లగడ్డ సబ్‌ ట్రెజరీలో పని చేసిన కొందరు ఉద్యోగులు అహోబిలం పీహెచసీలో పనిచేస్తున్న యూడీసీ ఇంతియాజ్‌ అలీఖానతో కుమ్మకై ఐదేళ్లుగా ఆరోగ్య శాఖకు సంబంధించిన కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీత భత్యాల్లో రూ.కోటిన్నర అవకతవకలకు పాల్పడినట్లు తెలిసింది. వీటిపై త్వరలోనే విచారణ చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. అహోబిలం పీహెచసీలో 2019 నుంచి 2025వ ఇంతియాజ్‌ అలీఖాన యూడీసీగా విధులు నిర్వహించారు. ఇటీవలే బదిలీపై జమ్మలమడుగు మండలం వదిరాలకు వెళ్లారు. ఈయన అహోబిలంలో విధులు నిర్వహించే సమయంలో అహోబిలంలోని 17 మంది, నర్సాపురంలోని 11 మందికి జీత భత్యాలు ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో సబ్‌ట్రెజరీ అధికారులతో కుమ్మకై రూ.కోటిన్నర స్వాహా చేశారని సమాచారం.

ఇటీవలే జరిగిన ఆడిట్‌లో..

ఆళ్లగడ్డ సబ్‌ట్రెజరీ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఆడిట్‌లో ఈవిషయం బయటకు వచ్చింది. ఆయా ఆసుపత్రుల్లో విఽధులు నిర్వహించే సిబ్బంది జీతభత్యాల వివరాలు ట్రెజరీ కార్యాలయంలో అందజేస్తే వేతనాలు వారి ఖాతాల్లో జమ అవుతుంటాయి. ఈవ్యవహారంలో నకిలీ ఖాతాలు సృష్టించి ఐదేళ్లుగా సొమ్ము కాజేశారు. ఈ వ్యవహారంలో ట్రెజరీలో పని చేసే ముగ్గురు ఉద్యోగులు కీలకంగా వ్యవహరించినట్లు తెలసుస్తోంది. ఇందులో వైధ్యాల హస్తం ఉందన్న చర్చకూడా జోరందుకుంటోంది. జిల్లా అధికారులు ఈ వ్యవహారంపై పూర్తిస్ధాయిలో విచారణ చేస్తే నిజాలు నిగ్గు తేలే అవకాశం ఉంది. ఈ విషయం పై యూడీసీ ఇంతియాజ్‌ అలీఖానను వివరణ కోరగా ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని విచారణ లో నిజాలు బయట పడతాయని వివరించారు.

Updated Date - Dec 13 , 2025 | 11:30 PM