Share News

Telugu Desam Party: పదవుల బొనాంజా!

ABN , Publish Date - Dec 25 , 2025 | 04:34 AM

తెలుగుదేశం పార్టీలో పదవుల జాతరకు తెరలేచింది. పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలను బుధవారం ప్రకటించారు.

Telugu Desam Party: పదవుల బొనాంజా!

  • టీడీపీలో 1,050 మందికి పోస్టులు

  • ఒక్కో పార్లమెంటరీ కమిటీలో 40 మంది

  • బీసీలకు 37ు, ఎస్సీలకు 20ు

  • ఓసీ-32ు, ఎస్టీ-4ు, మైనారిటీలకు 7ు

  • మహిళలకు 28 శాతం కేటాయింపు

అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో పదవుల జాతరకు తెరలేచింది. పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలను బుధవారం ప్రకటించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాకుండా 40 మందితో కూడిన జంబో కమిటీలను ప్రకటించారు. ప్రతి కమిటీలో 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 9 మంది అధికార ప్రతినిధులు, 9 మంది కార్యదర్శులు.. ట్రెజరర్‌, కార్యాలయ కార్యదర్శి, మీడియా కో-ఆర్డినేటర్‌, సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్లు ఉంటారు. ఈ మేరకు జిల్లాల్లోని పార్టీ యంత్రాంగానికి అధిష్ఠానం నుంచి సమాచారం అందింది. రెండ్రోజుల క్రితం పార్లమెంటరీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ప్రకటించారు. వీరితో కలిపి ఒక్కో కమిటీలో 42 మందిని నియమించారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 1,050 మందికి పదవులు దక్కాయి. పార్టీ పదవుల్లో మహిళలు, బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యమిచ్చారు. బీసీలకు మొత్తం పదవుల్లో 37 శాతం అంటే 389 పదవులు దక్కగా.. ఎస్సీలకు 20 శాతం (207 పదవులు) దక్కాయి. బీసీ, ఎస్సీలకు కలిపి 57 శాతం పదవులు లభించాయి. ఎస్టీలకు 4 శాతం, మైనారిటీలకు 7 శాతం, ఓసీలకు 32 శాతం పదవులు కేటాయించారు. మహిళలకూ పెద్దపీట వేశారు. మొత్తం పదవుల్లో 28 శాతం వారికే ఇచ్చారు.

అసెంబ్లీ ఇన్‌చార్జులపై కసరత్తు

పార్లమెంటరీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను విజయవంతంగా ముగించుకున్న టీడీపీ అధిష్ఠానం త్వరలో అసెంబ్లీ ఇన్‌చార్జుల నియామక ప్రక్రియపై దృష్టి పెట్టనుంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ ఎమ్మెల్యేలు 135 నియోజకవర్గాల్లో ఉన్నారు. మిగిలిన 40 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపొందిన 11 నియోజకవర్గాల్లో.. తంబళ్లపల్లె తప్ప మిగిలిన 10 చోట్ల టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు లేదా గతంలో ఇన్‌చార్జులుగా ఉన్నవారినే కొనసాగిస్తున్నారు. కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ గెలుపొందిన 29 నియోజకవర్గాల్లో.. ఎచ్చెర్ల, పాలకొండ, విశాఖ ఉత్తరం, యలమంచిలి, కైకలూరు, అవనిగడ్డ, పి.గన్నవరం, విజయవాడ పశ్చిమ, తిరుపతి మొదలైనవాటికే పార్టీ ఇన్‌చార్జులను నియమించాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా వీరినీ నియమించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Dec 25 , 2025 | 04:34 AM