Share News

Reproductive Health: గర్భనిరోధక మాత్రల అమ్మకాల జోరు

ABN , Publish Date - Nov 18 , 2025 | 04:45 AM

దేశంలో అత్యవసర గర్భనిరోధక మాత్రల (ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ ఈసీపీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా...

Reproductive Health: గర్భనిరోధక మాత్రల అమ్మకాల జోరు

  • దేశంలో ఏటా 35 మిలియన్‌ యూనిట్ల అమ్మకాలు

  • అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలో భారత్‌

  • పదేళ్లలో 12ు మేరకు పెరిగిన విక్రయాలు

  • ఎక్కువగా వాడటం ప్రమాదకరం అంటున్న వైద్యులు

  • అదే సమయంలో కండోమ్‌ల అమ్మకాలు తగ్గుముఖం

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): దేశంలో అత్యవసర గర్భనిరోధక మాత్రల (ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌- ఈసీపీ) అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఏటా 35 మిలియన్‌ యూనిట్ల (3.5 కోట్లు) కు పైగా అమ్ముడవుతున్నట్లు మోర్డర్‌ ఇంటెలిజెన్స్‌ ఇండస్ట్రీ నివేదికలో వెల్లడించింది. ఈసీపీల వినియోగంలో ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2019లో మనదేశంలో వీటి అమ్మకాలు సుమారు 33.5 మిలియన్‌ యూనిట్లు ఉండేది. ప్రస్తుతం వీటి అమ్మకాల విలువ 264 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు (రూ.23,414,023,776) ఉంది. ఇది 2030 నాటికి 377 మిలియన్‌ డాలర్ల (రూ.33,435,935,468) కు చేరుతుందని అంచనా. ఈ గణాంకాలను బట్టి మహిళలు కుటుంబ నియంత్రణకు అఽధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. 2009 నుంచి 2014 మధ్యకాలంలో ఈ మార్కెట్‌ 88ు వృద్థి నమోదు చేసింది. తర్వాతి దశాబ్దకాలంలో సగటున 12ు చొప్పున వృద్థి చెందుతోందని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

సులభంగా లభ్యం...

లెవోనార్జెస్ర్టెల్‌ 1.5 ఎం.జీ వంటి నిర్దిష్టమైన గర్భనిరోధక మాత్రలు ఎటువంటి డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ అవసరం లేకుండా మెడికల్‌ షాపుల్లో నేరుగా అమ్ముతున్నారు. వీటి అమ్మకాలు పెరగటానికి ఇదే కారణమని చెబుతున్నారు. 2019- 2021 మధ్య కాలానికి సంబంధించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స-5) ప్రకారం.. అత్యవసర గర్భనిరోధక మాత్రలను తీసుకునే మహిళల్లో 57ు మంది వాటిని మెడికల్‌ షాపుల నుంచి నేరుగా కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. మిగిలినవారు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్‌ క్లినిక్‌ల ద్వారా వాటిని పొందారు. ఈ అమ్మకాల వృద్థి కారణంగా అన్ని రకాల గర్భనిరోధక పద్ధతుల రేటు కూడా పెరిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 54 శాతం ఉన్న గర్భనిరోధక పద్ధతుల వినియోగ రేటు, 2019-21 నాటికి 67 శాతానికి పెరిగినట్లు తేలింది. సులభంగా లభించటంతో టీనేజర్లు అవాంఽచిత గర్భాన్ని నిరోధించేందుకు వీటిని ఎంచుకుంటున్నారని 2021లో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌సీబీఐ) అధ్యయనంలో వెల్లడైంది.


మనదేశంలో అవాంఛిత గర్భాల రేటు 11.9 శాతం ఉన్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఈ అవాంఛిత గర్భాల నిరోధానికి విరివిగా వాడుతుండటంతోఈపీసీల అమ్మకాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కుటుంబ నియంత్రణపై ప్రభుత్వాల చొరవ, అవగాహన కార్యక్రమాలు కూడా ఈ మాత్రల డిమాండ్‌ను పెంచుతున్నాయని చెబుతున్నారు. ఈపీసీల వినియోగం పెరగటంతో కండోమ్‌ విక్రయాలు తగ్గుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో కండోమ్‌ విక్రయాల్లో 41ుతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, ఫ్రాన్స్‌ రెండో స్థానంలో ఉంది. భారత్‌, ఆస్ర్టేలియా, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మనదేశంలో మొత్తం కండోమ్‌ల విక్రయాల్లో ఆన్‌లైన్‌ అమ్మకాల వాటా 34 శాతంగా ఉంది. మొత్తంగా చూస్తే ఐదేళ్లలో వీటి విక్రయాలు 17ు వరకు తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి. ఈసీపీలు ఎక్కువ కాలం వినియోగిస్తే ఆరోగ్యంపై తీవ్ర దుష్ఫ్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ ఉంటేనే వీటిని విక్రయించేలా నిబంధనలు మార్చాలనే ప్రతిపాదనలు గతంలో వచ్చాయి. కానీ, ఓవర్‌ ది కౌంటర్‌ ద్వారా లభ్యమయ్యే నిర్దిష్ట మాత్రల విషయంలో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇష్టం వచ్చినట్లు వాడితే ప్రమాదం

ఈసీపీలు ఇష్టం వచ్చినట్లు వాడితే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. నెలసరిలో సమస్యలు వస్తాయి. బరువు పెరుగుతారు. రక్తపోటు పెరుగుతుంది. కొన్నిసార్లు శరీరం వాపు వస్తుంది. దీంతోపాటు కడుపు ఉబ్బరం, కడుపులో వికారం, తలనొప్పి, వాంతులు లాంటి సమస్యలు వస్తాయి. రొమ్ముల్లో ఒక రకమైన ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే రెగ్యులర్‌ గర్భనిరోఽధక మాత్రలు వాడేవారిలో చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువకాలం వాడితే కొన్నిసార్లు గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

- డాక్టర్‌ ఎస్‌. విజయలక్ష్మి, గైనకాలజిస్టు

Updated Date - Nov 18 , 2025 | 04:45 AM