Endowments Department: దేవుడికీ దొరకరు
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:16 AM
రాష్ట్రంలో దాదాపు 70 శాతం మంది ఈవోలు రోజూ ఆలయాలకు వెళ్లడం లేదు. చివరకు భగవంతుడికి కూడా వారు దొరకడం లేదు. కొందరు నెలకోసారి ఆలయాలను సందర్శిస్తారు.
కొందరు ఈవోలు గుడికి వారానికోసారి వచ్చినా గొప్పే
వారిని దర్శించాలంటే సొంతూరు వెళ్లాల్సిందే
ఆలయాల్లో విధుల కంటే.. రాబడిపైనే దృష్టి
రియల్ ఎస్టేట్, సొంత వ్యాపారాలతో బిజీ
హుండీ లెక్కింపు, బోర్డు మీటింగులు ఉంటేనే రాక
గుళ్లను గాలికొదిలేసినా పట్టించుకోని శాఖ
ఆలయాల్లో పారిశుధ్యం సరిగ్గా ఉండడం లేదు. భక్తుల్లో సంతృప్త స్థాయి పెరగడం లేదు.. దర్శనాలు కూడా చాలా ఆలస్యమవుతున్నాయని మొత్తుకుంటున్నారు. సీఎం చంద్రబాబు కూడా దేవదాయ శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా ఆ శాఖ అధికారుల్లో మార్పు లేదు. ముఖ్యంగా ఆలయాల కార్యనిర్వహణాధికారుల (ఈవోలు) తీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. కొన్ని ప్రధాన ఆలయాల ఈవోలు మినహా.. మెజారిటీ అధికారులు గుళ్లలో కనిపించడమే లేదు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో దాదాపు 70 శాతం మంది ఈవోలు రోజూ ఆలయాలకు వెళ్లడం లేదు. చివరకు భగవంతుడికి కూడా వారు దొరకడం లేదు. కొందరు నెలకోసారి ఆలయాలను సందర్శిస్తారు. మరికొంత మంది వారానికో, మూడ్రోజులకో మొక్కుబడిగా వెళ్లి దేవుడికి కనబడి వెళ్తుంటారు. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ ఆలయాల్లో చాలా మంది ఈవోలు ఆలయాల్లో విధుల కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్నారు. కోనసీమ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఈవోకు రియల్ ఎస్టేట్ కింగ్‌గా పేరుంది. దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కీలకమైన అధికారి, మరో అసిస్టెంట్ కమిషనర్ కలిసి విశాఖపట్నం వేదికగా ఏకంగా రియల్ ఎస్టేట్ కంపెనీనే ప్రారంభించారు. దీని వ్యవహారాలన్నీ ఈ ఆలయం ఈవోయే చూస్తున్నారు. ఆలయంలో కంటే విశాఖలోనే ఎక్కువగా ఉంటారు. శాఖ కీలక అధికారి కూడా భాగస్వామి కావడం, ఉన్నతాధికారి అండదండలు ఉండడంతో ఈయన ఆడిందే ఆట. ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి శనివారం భక్తులు పోటెత్తుతారు. సదరు ఈవో ఆ రోజు మాత్రం వస్తారు. మిగతా రోజుల్లో పత్తా ఉండరు. అలాగే కృష్ణాజిల్లాలో ఇంకో కీలక ఆలయం ఈవో లెక్కే వేరు. మంత్రులు గుడికి వచ్చినా ఆయన లెక్క చేయరు. ఈయన భార్య విజయవాడలోని ఓ ప్రముఖ కాలేజీలో లెక్చరర్ కావడంతో ఈయనా అక్కడే నివాసం ఉంటారు. వారానికి ఒక్కసారి కూడా గుడికి వెళ్లరు.
ఎమ్మెల్యే కావడమే లక్ష్యం..: ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి రాజమండ్రిలో దేవదాయ శాఖ పరిధిలో ఈవోగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే కావడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. అనేక ఆరోపణలున్న సదరు అధికారిని కలవాలంటే ఎవరైనా విజయవాడ రావలసిందే. ఆయనకు నచ్చినప్పుడు, బుద్ధిపుట్టినప్పుడు రాజమండ్రి వెళ్లి కాసేపు అందరికీ హాయ్ చెప్పి మళ్లీ విజయవాడ వచ్చేస్తారు. వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటూ సొంతూర్లోనే ఎక్కువగా గడుపుతుంటారు. ఇదే జిల్లాలోని ప్రముఖ ఆలయం ఈవో.. గుడిలో కంటే దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలోనే ఎక్కువగా ఉంటారు. రెండు, మూడ్రోజులకోసారి కమిషనరేట్‌కు వచ్చి పేషీలో కాలక్షేపం చేయడమే పనిగా పెట్టుకున్నారు. కమిషనరేట్‌లోని కీలక అధికారికి శిష్యుడిగా ముద్ర వేసుకున్న సదరు ఈవో ఆలయ నిర్వహణను గాలికొదిలేశారు. విజయవాడలో ఒక మహిళా ఈవో నెలల తరబడి ఆలయం ముఖం చూడడం లేదన్న ఆరోపణలున్నాయి. గ్రేడ్-1 ఈవోగా ఉన్న ఆమె ఏ ఆలయంలో పోస్టింగ్ తీసుకున్నా.. రోజువారీ విధులు నిర్వహించరు.
కాలేజీల్లో లెక్చరర్‌గా..: గుంటూరు జిల్లాలో ఓ పురాతన దేవాలయానికి ఇన్‌చార్జి ఈవోగా ఉన్న అధికారి ఎక్కువగా ప్రైవేటు కాలేజీల్లో ఉంటుంటారు. అక్కడ లెక్చరర్‌గా పని చేస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. చిలకలూరిపేట సమీపంలోని ఇంకో ప్రముఖ ఆలయం ఈవో భార్య మార్కాపురంలో ప్రభుత్వ టీచరుగా ఉన్నారు. ఈయన ఆ ఊరు వదిలి రానేరారు. ఏవైనా ఫైళ్లుంటే రెండు వారాలకోసారి వచ్చి సంతకాలు పెట్టి చెక్కేస్తుంటారు. ప్రకాశం జిల్లాలోని ప్రముఖ ఆలయం ఈవో కూడా ఇంతే. మంత్రి మనిషినని చెప్పుకొంటూ తనకు నచ్చినప్పుడు గుడిని సందర్శిస్తుంటారు. ఇంకో ఈవో తాను ఎమ్మెల్యే బావమరిదినని చెప్పుకొంటూ.. ఎండోమెంట్ అధికారులను బెదిరిస్తూ రెండ్రోజులకోసారి ఆలయానికి వెళ్తుంటారు. ఇలా దాదాపు 70శాతం మంది ఈవోలు రోజువారీగా ఆలయాలకు వెళ్లని పరిస్థితి. వీరిపై దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయం, జిల్లా అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. ప్రతి ఉద్యోగి ఎఫ్‌ఆర్‌ఎస్ వేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. అది వేస్తేనే జీతాలివ్వాలన్న నిబంధన ఉంది. ఇవేవీ ఆలయాల ఈవోలకు వర్తించడం లేదు. వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఈవోలు ఆలయాలకు డుమ్మా కొడుతున్నారని తెలిసినా దేవదాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి పెట్టడం లేదు. కొరడా ఝళిపించి వారిని దారిలో పెట్టేవరకు.. సీఎం ఎంత అసహనం వ్యక్తం చేసినా.. ఎన్ని ఆర్టీజీఎస్ సర్వేలు చేసినా పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.