Share News

Eluru: అటు జ్ఞానం.. ఇటు సేవాగుణం..

ABN , Publish Date - Aug 12 , 2025 | 05:15 AM

ఏలూరు జిల్లాలో ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నతంగా ఆలోచించారు. ఒకరు జ్ఞానాన్ని అందించే బుక్‌ నూక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయగా.. మరొకరు కైండ్‌నెస్‌ వాల్‌ ఏర్పాటుతో మనలోని సేవాగుణాన్ని చాటుకునే అవకాశం కల్పించారు.

Eluru: అటు జ్ఞానం.. ఇటు సేవాగుణం..

  • ఏలూరులో బుక్‌ నూక్‌, కైండ్‌నెస్‌ వాల్‌ ఏర్పాటు

  • పుస్తక పఠనాన్ని, సేవా గుణాన్ని పెంచేలా చర్యలు

  • ఏలూరు జిల్లా ఎస్పీ, జేసీ దంపతుల వినూత్న ఆలోచన

(ఏలూరు-ఆంధ్రజ్యోతి)

ఏలూరు జిల్లాలో ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నతంగా ఆలోచించారు. ఒకరు జ్ఞానాన్ని అందించే ‘బుక్‌ నూక్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేయగా.. మరొకరు ‘కైండ్‌నెస్‌ వాల్‌’ ఏర్పాటుతో మనలోని సేవాగుణాన్ని చాటుకునే అవకాశం కల్పించారు. దంపతులైన జిల్లా ఎస్పీ కేవీపీఎస్‌ ప్రతాప్‌ కిశోర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి ఈ వినూత్న ప్రక్రియకు తెరతీశారు.

పుస్తకాలు చదువుకోవచ్చు.. తీసుకెళ్లొచ్చు..

ఏలూరు నగరంలో ప్రస్తుతానికి రెండు చోట్ల ఇడా ఆధ్వర్యంలో దీనికి వైస్‌ చైర్మన్‌గా ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి ‘ఏలూరు బుక్‌ నూక్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేశారు. ఎస్పీ కార్యాలయం, సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద ఏర్పాటు చేసిన రెండు అరలతో కూడిన బాక్స్‌ల్లో.. ఎవరైనా తమకు అవసరం లేని పుస్తకాలు ఇక్కడ పెట్టొచ్చు. అక్కడే కాసేపు నిలబడి చదువుకోవచ్చు. కావాలనుకుంటే ఇంటికి తీసుకెళ్లొచ్చు. చదివిన తర్వాత మళ్లీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చు. ఈ విధానం వల్ల పేదలకు, పుస్తకాలు అవసరమున్న వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. దీనిలో కంప్యూటర్‌, సైన్స్‌, కథల పుస్తకాలు, ఇతర క్లాసులకు సంబంధించి స్టడీ బుక్స్‌ కూడా స్థానికులు పెడుతున్నారు. ఇది ఏర్పాటు చేసి రెండు నెలలు కావస్తుండగా నగర వాసులు పుస్తకాలు పెట్టడం, ఇక్కడ నుంచి తీసుకెళ్లి చదువుకోవడానికి అలవాటుపడుతున్నారు.


కైండ్‌నెస్‌ వాల్‌తో పేదలకు మేలు..

ఎస్పీ ప్రతాప్‌ కిశోర్‌... పోలీస్‌ అధికారుల సంఘం తరఫున నగరంలోని అమీనాపేట రోడ్డులో పోలీస్‌ కల్యాణ మండపం వద్ద కైండ్‌నెన్‌ వాల్‌ను ఏర్పాటు చేయించారు. దీనిలో ఎలక్ర్టానిక్స్‌ గూడ్స్‌, మహిళలు, పెద్దలు, చిన్నారులు ఏ వయస్సు వారైనా తమకు అవసరం లేని దుస్తులు, బొమ్మలు, చెప్పులు, షూలు దగ్గర్నుంచి, వంట సామగ్రి, ఇతర వస్తువులను ఈ వాల్‌ దగ్గర పెట్టి వెళ్లవచ్చు. అవసరమైనవారు ఎవరైనా వాటిని నిరభ్యంతరంగా తీసుకెళ్లొచ్చు. ఇది ప్రారంభించిన రెండు రోజుల్లోనే సేవాగుణం ఉన్న వారు దుస్తులు, షూలు, బెల్ట్‌లు, ఇతర వస్తువులను దానం ఇస్తున్నారు.

మంత్రి లోకేశ్‌ అభినందన

మనకు అవసరం లేనివి ఇతరులకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ‘కైండ్‌నెస్‌ వాల్‌’ ఏర్పాటు చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్‌ కిశోర్‌కు మంత్రి నారా లోకేశ్‌ సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ తరహా ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు.

Updated Date - Aug 12 , 2025 | 05:15 AM