Digital Fraud: సైబర్ గ్యాంగ్‌కు సంకెళ్లు
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:02 AM
ఒక సాధారణ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అంతర్జాతీయ సైబర్ ముఠా ఆట కట్టించారు ఏలూరు పోలీసులు. ఒక బ్యాంకు మేనేజర్, మహారాష్ట్రకు చెందిన పోలీసు సహా 11 మందితో కూడిన గ్యాంగ్‌ను అరెస్టు చేశారు.
11 మందిని అరెస్టు చేసిన ఏలూరు పోలీసులు
డిజిటల్ అరెస్టు పేరిట అంతర్జాతీయ ముఠా మోసాలు
యూపీ నుంచి అమెరికా వరకూ వీరి నెట్‌వర్క్
మ్యూల్ ఖాతాల నుంచి డిజిటల్ రూపంలోకి డబ్బు మార్పు
డిజిటల్ అరెస్టే లేదు.. 1930కు కాల్ చెయ్యండి: ఐజీ రవికృష్ణ, ఎస్పీ శివ కిశోర్
అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఒక సాధారణ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అంతర్జాతీయ సైబర్ ముఠా ఆట కట్టించారు ఏలూరు పోలీసులు. ఒక బ్యాంకు మేనేజర్, మహారాష్ట్రకు చెందిన పోలీసు సహా 11 మందితో కూడిన గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. వీరిని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అభినందించారు. ఆ వివరాలను మంగళగిరిలోని పోలీసుల రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సైబర్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ, ఏలూరు ఎస్పీ కె.ప్రతాప్ శివ కిశోర్ శనివారం విలేకరులకు వివరించారు. ఏలూరు టూ టౌన్ పరిధిలోని 66 ఏళ్ల మహిళ సెల్‌ఫోన్‌కు సెప్టెంబరు చివరి వారంలో ఒక వీడియో కాల్ వచ్చింది. మొదట టెలికం డిపార్ట్‌మెంట్ అని ఒకరు, ఆ తర్వాత యూనిఫామ్ వేసుకుని పోలీసు అంటూ మరొకరు లైన్‌లోకి వచ్చారు. ‘మీ ఆధార్ కార్డును నేరంలో వాడారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం’ అంటూ వారెంట్ చూపించి 72 గంటల పాటు బెదిరించారు. ఆమె ఖాతాలో ఉన్న డబ్బులతో పాటు బంగారం తాకట్టు పెట్టి రూ.52లక్షల వరకూ చెల్లించినా సైబర్ నేరగాళ్లు బెదిరిస్తూనే ఉన్నారు. దీంతో బాధితురాలు జిల్లా ఎస్పీ కిశోర్‌కు చెప్పడంతో ఏలూరు టూ టౌన్ పోలీసుస్టేషన్‌లో సెప్టెంబరు 24న కేసు నమోదు చేశారు. 23 మంది పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దేశంలోని ఆరు రాష్ట్రాల్లో నెల రోజులపాటు 14వేల కిలోమీటర్లు తిరిగి కేసును ఛేదించారు. కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, గోవాల్లో ఉన్న పదకొండు మందిని అరెస్టు చేశారు. నేపాల్, చైనా, కాంబోడియా, సింగపూర్, అమెరికాల్లోనూ ఈ గ్యాంగ్ సభ్యులు ఉండటంతో వారినీ అరెస్టు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థల సహాయం కోరారు.
ఈ గ్యాంగ్ కాంబోడియా, నేపాల్‌కు చెందిన వీవోఐపీ నంబర్లతో ఫోన్‌కాల్స్ చేసి నకిలీ పోలీస్ ఐడీలు, వారెంట్లు చూపించి బాధితుల్ని బెదిరిస్తారు. డిజిటల్ అరెస్టు పేరిట నిర్బంధించి ఎవ్వరితోనూ మాట్లాడనీయకుండా భయపెట్టి సేఫ్ అకౌంట్స్ పేరుతో మ్యూల్ ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయించుకుంటారు. అకౌంట్లలోకి వచ్చిన డబ్బుతో వీలైనంత వేగంగా క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేసి మొత్తం డబ్బు రూపాన్నే మార్చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి, సీతాపూర్, బారాబంకీ జిల్లాల్లో పోలీసు స్టేషన్ సెట్ వేసుకున్న సైబర్ ముఠా బాధితుల నుంచి కొల్లగొట్టిన సొమ్ము బెంగళూరులోని మ్యూల్ ఖాతాలకు బదిలీ చేయించుకుంది. ఈ వ్యవహారంలో మహారాష్ట్రలోని నాగపూర్‌లో బ్యాంకు మేనేజర్, యావత్మల్‌లోని ఒక పోలీసు ప్రమేయం బయటపడింది. నిందితుల నుంచి 12స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్, సిమ్ బాక్స్, 40కిపైగా క్రిప్టో లావాదేవీలు, చైనాకు చెందిన 112 అక్రమ పేమెంట్ గేట్‌వేలు, 150కిపైగా మ్యూల్ ఖాతాలు, బైనాన్స్ వాలెట్ లావాదేవీలు సీజ్ చేసినట్లు ఐజీ, ఎస్పీ వెల్లడించారు. దీనికి పొరుగు రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర సంస్థలైన సెర్ట్-ఇన్, ఐ4సీ, భారత్‌పోల్ సహకారం తీసుకున్నట్టు తెలిపారు. ‘డిజిటల్ అరెస్టు అనేది మన దేశంలోని ఏ చట్టంలోనూ లేదు. ఎవరైనా డిజిటల్ అరెస్టు పేరు చెప్పి వీడియో కాల్ చేస్తే భయపడకుండా వెంటనే 1930కు ఫోన్ చెయ్యండి’ అని సూచించారు.
ఫోన్ రీస్టార్ట్ చేసినా పనిచేసేలా..
సైబర్ దొంగలు ఏ విధంగా డబ్బు కొల్లగొట్టి, ఎలా మార్చుకొంటున్నారో ఫోరెన్సిక్ విశ్లేషణలో తేలింది. SMSrelease20257151.1.0.apk అనే యాప్ చైనాకు చెందిన admin.yespayment.net సర్వర్‌తో కనెక్ట్ అయినట్లు తేలింది. ఖికఖిలను ఆటోమెటిక్‌గా ఫార్వర్డ్ చేయడంతో పాటు ఫోన్ రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా పనిచేసేలా ఈ యాప్‌ను రూపొందించారు. క్రిప్టో ట్రేసింగ్‌లో కాజేసిన డబ్బు USDT స్టేబుల్ కాయిన్ రూపంలో Binanace ప్లాట్‌ఫామ్‌లోకి మార్చి, తర్వాత చైనీస్ యువాన్(ఇ్గూ)లోకి మళ్లించినట్లు బయట పడింది. దర్యాప్తులో EPI4337, EPI7702 వంటి స్మార్ట్ కాంట్రాక్టు ప్రోటోకాల్స్ ఉపయోగించి ఆటోమేటిగ్గా గుర్తించేందుకు వీళ్ల వాలెట్ల ద్వారా నిధులు క్రిప్టోకు బదిలీ అయినట్లు వెల్లడైంది.
ప్రతి పోలీసుస్టేషన్‌లో
ఒక సైబర్ వారియర్: ఆకే రవికృష్ణ
ఆండ్రాయిడ్ ఫోన్లలోని సోషల్ మీడియా గ్రూపులకు వచ్చే ఏపీకే ఫైళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని, ముఖ్యంగా పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాలని ఆకే రవికృష్ణ సూచించారు. రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి త్వరలో 26 పోలీసు స్టేషన్లు ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఇటీవల ఎంపికై శిక్షణ తీసుకొంటున్న 6,100 మంది పోలీసులకు తప్పనిసరిగా సైబర్ నేరాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి పోలీసుస్టేషన్లోనూ ఒక సైబర్ వారియర్(కానిస్టేబుల్)ను నియమించి ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. సైబర్ మోసాలు బాగా పెరుగుతున్నాయని, ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ప్రతి నెలా రూ.70కోట్లకు పైగా సైబర్ మోసాల్లో పోగొట్టుకుంటున్నారన్నారు.