Eluru District: పేకాట డెన్‌పై పోలీసుల దాడి
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:32 AM
నూజివీడు నియోజకవర్గ పరిధిలో రిక్రియేషన్ క్లబ్ పేరిట నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఏలూరు జిల్లా పోలీసులు మెరుపు దాడులు చేశారు.
281 మంది అరెస్టు.. రూ.32 లక్షలు స్వాధీనం
అదుపులో ఆంధ్ర, తెలంగాణవాసులు
ఆగిరిపల్లిలోని రిక్రియేషన్ క్లబ్ వద్ద బంధువుల ఆందోళన
నూజివీడు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నూజివీడు నియోజకవర్గ పరిధిలో రిక్రియేషన్ క్లబ్ పేరిట నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఏలూరు జిల్లా పోలీసులు మెరుపు దాడులు చేశారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండల పరిధిలోని మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ సొసైటీలో భారీ ఎత్తున్న జూదం జరుగుతోందన్న సమాచారంపై ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ ఆదేశాలతో.. పోలీసులు ఆదివారం రాత్రి ఈ దాడులు నిర్వహించారు. క్లబ్‌లో పేకాడుతున్న 281 మందిని అదుపులోకి తీసుకోగా, మరికొందరు తప్పించుకుని పారిపోయారు. జూదం ఆడడానికి వచ్చిన వ్యక్తులకు చెందిన 130 వాహనాలు, 40 ద్విచక్ర వాహనాలతో పాటు సుమారు 32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. సొసైటీ నిర్వాహకులు కిలారి అప్పారావు, కాట్రగడ్డ అశోక్‌లను కూడా అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. క్లబ్‌లో జూదాలకు సంబంధించిన కుర్చీలు, టేబుళ్లను స్వాధీన పరచుకుని కోర్టుకు అప్పగించనున్నట్టు తెలిపారు. కాగా, మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ సొసైటీలో 2019లో మూతపడగా 2025లో నవంబరు మొదటి వారం నుంచి మళ్లీ తెరిచారు. ఈ సందర్భంలో, సొసైటీ వెనుక మంత్రి లోకేశ్ ఉన్నారంటూ నిర్వాహకులు విస్తృతంగా ప్రచారం చేశారు. సొసైటీలో సభ్యత్వం పొందాలంటే ముఖ్యమంత్రి స్థాయిలోని నాయకుల రికమండేషన్లు ఉండాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిబంధనల ప్రకారమే సొసైటీ నిర్వహణ ఉంటుందని విలేకరులకూ వెల్లడించారు. ఈ ప్రచారాల నేపథ్యంలో సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సొసైటీ వ్యవహారంపై ఎస్పీ మెరుపు దాడులు నిర్వహిండం.. అసత్య ప్రచారాలకు చెక్ పెట్టినట్లయింది. కాగా, అదుపులోకి తీసుకున్న పేకాట రాయుళ్లను కోర్టులో హాజరు పరచకపోవడంపై వారి బంధువులు రిక్రియేషన్ క్లబ్ వద్ద సోమవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. దొరికినవారిలో 30 శాతానికి పైగా తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు ఉండటంతో అక్కడి నుంచి వారి బంధువులు వచ్చి ఆందోళన చేపట్టారు.