Share News

Elephant Attack: జనావాసాల్లో ఏనుగు హల్‌చల్‌

ABN , Publish Date - Sep 14 , 2025 | 03:46 AM

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ పరిసరాల్లోని గంగవరంలో శనివారం ఓ ఏనుగు హడలెత్తించింది. చిరుతపల్లి అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి...

Elephant Attack: జనావాసాల్లో ఏనుగు హల్‌చల్‌

  • అటవీ సిబ్బందిపై దాడి.. ఇద్దరికి గాయాలు!

  • చిత్తూరు జిల్లా గంగవరంలో ఘటన

  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు

గంగవరం/అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ పరిసరాల్లోని గంగవరంలో శనివారం ఓ ఏనుగు హడలెత్తించింది. చిరుతపల్లి అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఆ ఏనుగు ఓ అటవీశాఖ అధికారిపై దాడి చేసి గాయపరిచింది. మరో ఏనుగుల ట్రాకర్‌కు కూడా గాయాలైనట్లు సమాచారం. మంద నుంచి విడిపోయిన ఏనుగు.. తెల్లవారుజాము 4 గంటలకు గంగవరం పోలీ్‌సస్టేషన్‌ వద్ద ప్రత్యక్షమైంది. గంటసేపు అక్కడే తిరుగుతూ జనావాసాల మధ్యకు చేరుకుంది. సమాచారం అందుకొన్న అటవీ అధికారులు ట్రాకర్లతో కలిసి అక్కడకు చేరుకున్నారు. టపాకాయలు పేల్చుతూ ఏనుగును అడవి వైపు మళ్లించే ప్రయత్నం చేశారు. దీంతో పరుగులు తీసిన ఏనుగు.. చుట్టూ నివాసాలుండడంతో అడవిలోకి వెళ్లలేక, రోడ్డు పక్కన ఆపి ఉన్న కారును ధ్వంసం చేసి డ్రైవర్స్‌ కాలనీ వైపు వెళ్లింది. పాత కీలపట్ల రోడ్డులో ముందుకెళ్తూ జనసందోహాన్ని గమనించి ట్రాకర్లు, అటవీ అధికారులపైకి దూసుకొచ్చింది. దీంతో వారంతా పరుగులు తీస్తుండగా.. ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ సుకుమార్‌ కాలుజారి కింద పడి ఏనుగుకు చిక్కాడు. సుకుమార్‌పై దాడికి దిగిన ఏనుగును ట్రాకర్లు పెద్దగా కేకలు వేసి తరిమేశారు. తీవ్రంగా గాయపడిన సుకుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. గంటావూరు వద్ద ఓ లేగదూడపై కూడా ఏనుగు దాడి చేసి గాయపరిచింది. అటవీశాఖ అధికారులు, ట్రాకర్లు, పోలీసులు 7 గంటల పాటు శ్రమించి.. ఏనుగును అడవిలోకి మళ్లించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు.. ఒకవేళ ఏనుగు మళ్లీ వస్తే, దాన్ని అదుపు చేసేందుకు రెండు కుంకీలను పలమనేరు సమీపానికి తరలించారు.

ఏనుగుల కదలికలను పర్యవేక్షించాలి: పవన్‌

ఏనుగు దాడిలో గాయపడిన అటవీ సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. అటవీశాఖ ఎఫ్‌ఎ్‌సవో సుకుమార్‌, ఏనుగుల ట్రాకర్‌ హరిబాబుకు తక్షణం మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. దాడిపై సమాచారం అందుకున్న పవన్‌ ఏనుగుల సంచారంపై సమీక్షించారు. ఏనుగుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏనుగుల కదలికలను కొన్నిరోజుల పాటు నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైతే కుంకీ ఏనుగులతో గస్తీ నిర్వహించాలన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 03:46 AM