Forest Department: కాలు విరిగిన ఏనుగుకు కుంకీల సాయం..
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:25 AM
వారం రోజుల క్రితం తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన ఓ ఏనుగు.. యాదమరి మండలం తెల్లరాళ్లపల్లె పంచాయతీ డీకే చెరువు అటవీ ప్రాంతంలోని...
ఎస్వీ జూకు తరలించే ఏర్పాటు చేస్తున్న అటవీ అధికారులు
యాదమరి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వారం రోజుల క్రితం తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన ఓ ఏనుగు.. యాదమరి మండలం తెల్లరాళ్లపల్లె పంచాయతీ డీకే చెరువు అటవీ ప్రాంతంలోని నీటికుంటలో కాలు విరిగి కదల్లేని స్థితిలో పడి ఉంది. అటవీ శాఖ అధికారులు దీన్ని తిరుపతిలోని ఎస్వీ జూ పార్కుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏనుగు వారం క్రితం తమిళనాడు నుంచి సరిహద్దు ప్రాంతమైన యాదమరి మండలంలోని కమ్మపల్లె అటవీ బీట్‌లోకి ప్రవేశించింది. కాలుజారి పడటంతో కుడికాలు తొడభాగంలో ఎముక విరిగింది. అలాగే తిరుగుతూ శనివారం రాత్రి డీకే చెరువు సమీపంలోని గుడ్డివాని చెరువు వద్దకు వచ్చి బురదలో ఇరుక్కుంది. ఆదివారం స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు వచ్చి పరిశీలించారు. పలమనేరు సమీపంలోని ముసలిమడుగు నుంచి రెండు కుంకీ (కృష్ణ, అభిమన్యు)లను రప్పించి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సహాయక చర్యలు చేపట్టారు. చెరువు నుంచి దీన్ని బయటకు తీశాక తిరుపతిలోని ఎస్వీ జూ పార్కుకు తరలిస్తామని అనంతపురం సర్కిల్ సీసీఎఫ్ యశోదాబాయి తెలిపారు.