Minister Gottipati Ravi Kumar: విద్యుత్ సిబ్బంది అప్రమత్తం
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:31 AM
రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ వాతావరణ శాఖ ‘ఎల్లో అలెర్ట్’ జారీ చేసిన నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది.
వర్షాలపై ఎల్లో అలెర్ట్ నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా చర్యలు
సరఫరా బ్రేక్ కాకుండా పర్యవేక్షణ.. డిస్కమ్‌లకు మంత్రి గొట్టిపాటి ఆదేశం
అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ వాతావరణ శాఖ ‘ఎల్లో అలెర్ట్’ జారీ చేసిన నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. సరఫరా సహా తీగలు తెగిపోవడం, స్తంభాలు నేల కూలడం వంటి వాటి విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కమ్)లను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు సంతోషరావు, పుల్లారెడ్డి, పృథ్వీతేజ్‌లతో ఆదివారం మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, గాలుల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడే అవకాశం ఉందని, వీటి వల్ల ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. చెట్ల కొమ్మలు విరిగిపడటం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈదురుగాలులకు కరెంటు స్తంభాలు కూలిపోయే అవకాశం ఉందని, అలాంటి వాటిని వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే వెంటనే కొత్తవాటిని ఏర్పాటు చేయాలన్నారు. డిస్కమ్‌లు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ.. ‘కాల్ సెంటర్’ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని గొట్టిపాటి ఆదేశించారు.