Palle Raghunatha Reddy: అక్షరం నింపిన వెలుగులు
ABN , Publish Date - Oct 02 , 2025 | 04:12 AM
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులోని బీసీ కాలనీలో ‘అక్షరం’ వెలుగులు నింపింది. ఏళ్లుగా ఉన్న విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపింది...
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువుకు విద్యుత్ లైన్
ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుతో విద్యుత్ సమస్యకు పరిష్కారం
కొత్తచెరువు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులోని బీసీ కాలనీలో ‘అక్షరం’ వెలుగులు నింపింది. ఏళ్లుగా ఉన్న విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపింది. దసరా పండుగ వేళ గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. కాలనీలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను బుధవారం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రారంభించి విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టారు. చాలా ఏళ్లుగా.. ఈ బీసీ కాలనీకి విద్యుత్ సరఫరా సక్రమంగా జరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. లో వోల్టేజీతో ఇళ్లలోని టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఇతర ఎలక్ర్టికల్ సామగ్రి కాలిపోతుండేవి. తరచూ విద్యుత్ అంతరాయాలతో ప్రజలు విసిగిపోతుండేవారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 28న స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’ కార్యక్రమం జరిగింది. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, వివిధ శాఖల అధికారులు కార్యక్రమానికి హాజరుకాగా.. మండల ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. కొత్తచెరువు బీసీ కాలనీలో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని షబీనా, కుళ్లాయప్ప కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. బీసీ కాలనీకి రూ.14.50 లక్షలతో 20 విద్యుత్ స్తంభాలు, 11 కేవీ లైన్, ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేశారు. దీంతో కాలనీలోని 300 ఇళ్లకు విద్యుత్ సమస్య తీరింది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ వెంకటేశ్‌నాయక్, లైన్‌మన్ రోషన్, నాయకులు సాలక్కగారి శ్రీనివాసులు, కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణ, ఒలిపి శీనా, అనిల్, అరుణ్, వెంకటేశ్ పాల్గొన్నారు.