Share News

AP Power Supply: సర్దుపోటు లేదు.. ట్రూఅప్‌ బాదుడూ ఉండదు

ABN , Publish Date - Jul 09 , 2025 | 04:49 AM

రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెరగవని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఏపీఎస్పీడీసీఎల్‌, ఏపీసీపీడీసీఎల్‌, ఏపీఈపీడీసీఎల్‌ సంయుక్తంగా స్పష్టం చేశాయి అలాగే సర్దుబాటు చార్జీల భారంగానీ, ట్రూఅప్‌ చార్జీల భారం గానీ మోపబోమని తేల్చిచెప్పాయి.

AP Power Supply: సర్దుపోటు లేదు.. ట్రూఅప్‌ బాదుడూ ఉండదు

  • ఈ ఏడాది కరెంటు చార్జీలు పెరగవు: డిస్కంలు

  • అధిక ధరలతో విద్యుత్‌ కొనుగోళ్లు తగ్గించాం.. దీంతో ఆదాయం పెరిగింది

అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెరగవని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఏపీఎస్పీడీసీఎల్‌, ఏపీసీపీడీసీఎల్‌, ఏపీఈపీడీసీఎల్‌ సంయుక్తంగా స్పష్టం చేశాయి అలాగే సర్దుబాటు చార్జీల భారంగానీ, ట్రూఅప్‌ చార్జీల భారం గానీ మోపబోమని తేల్చిచెప్పాయి. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) వెల్లడించిన 2024-25 విద్యుత్‌ విక్రయాల ఆడిట్‌ గణాంకాల్లో తమ లెక్కలను విడివిడిగా చూపడంతో.. ఒక్కో సంస్థలోని ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసాలు కనిపించాయని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఏటా ఆదాయ వ్యయాల నివేదికలను మూడు డిస్కంలూ కమిషన్‌కు వేర్వేరుగా ఒకేసారి సమర్పిస్తాయని గుర్తుచేశాయి. రాష్ట్రంలోని మూడు డిస్కంల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే విద్యుత్‌ విక్రయాల్లో రూ.456 కోట్ల మిగులు ఉందని ధ్రువీకరించాయి దీనివల్ల విద్యుత్‌ వినియోగదారులపై ఇంధన సర్దుబాటు చార్జీలు గానీ, ట్రూఅప్‌ చార్జీలు గానీ పడబోవని, వాటిని విధించే అవసరం లేదని డిస్కంల సీఎండీలు సంతోషరావు, పృధ్వీతేజ, పుల్లారెడ్డి సదరు ప్రకటనలో తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక.. విద్యుత్‌ రంగంలో సమర్థ యాజమాన్య నిర్వహణ ద్వారా బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కరెంటు కొనడం తగ్గించామన్నారు. ఫలితంగా ఆదాయం పెరిగిందని చెప్పారు. ఈ మేరకు ఏపీఈఆర్‌సీకి వివరణ ఇస్తామని తెలిపారు. గత జగన్‌ ప్రభుత్వం ఏటా ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపుతూ వచ్చిందని గణాంకాలతో వారు వెల్లడించారు. 2021-22లో రూ.3,082.99 కోట్లు, 2022-23లో రూ.6,072.77 కోట్లు, 2023-24లో రూ.9,412.50 కోట్లు.. మొత్తంగా రూ.18,568.26 కోట్లు భారం వేసిందని చెప్పారు. అలాగే అప్పట్లో పెంచిన విద్యుత్‌ చార్జీలను చార్జీలను పరిశీలిస్తే.. తాజా ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌ కొనుగోలు వ్యయం గణనీయంగా తగ్గినట్లు అర్థమవుతోందన్నారు.


నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలి: సీఎస్‌

వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ డిస్కంలను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయన డిస్కంల ఎండీలతో వీడియో కాన్ఫరెన్సులో సమీక్ష జరిపారు. అంతరాయాలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని.. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు అందించాలని స్పష్టంచేశారు. వార్డు సచివాలయాల్లో పనిచేసే విద్యుత్‌ సిబ్బంది పెన్షన్ల పంపిణీ రోజు మాత్రమే ఆ విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని.. మిగిలిన సమయాల్లో విద్యుత్‌ శాఖ సేవలే నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 04:51 AM