Minister Gottipati Ravi Kumar: నిబంధనలకు లోబడే పరికరాల కొనుగోళ్లు
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:33 AM
ఈ-ప్రొక్యూర్మెంట్, కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారానే విద్యుత్ పరికరాలను కొంటున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
ఈ-ప్రొక్యూర్మెంట్, కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారానే కొంటున్నాం: మంత్రి గొట్టిపాటి
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఈ-ప్రొక్యూర్మెంట్, కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారానే విద్యుత్ పరికరాలను కొంటున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ పరికరాల కొనుగోళ్లు, ధరల సమాచారంపై ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, పేరాబత్తుల రాజశేఖరం గురువారం శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ కొనుగోళ్లన్నీ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) నిబంధనలకు లోబడే చేస్తున్నామని చెప్పారు. రూ.5 కోట్లకు పై బడిన కొనుగోళ్లకు ఈఆర్సీ అనుమతులు తీసుకుంటున్నామని, అలాగే పరికరాల కొనుగోళ్లలో నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, ప్రజా అవసరాలకు 5 స్టార్ రేటింగ్ ట్రాన్స్‌ఫార్మర్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. జగన్ కాలనీల కోసం రూ.220 కోట్లతో కొనుగోలు చేసిన విద్యుత్ పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయని వాటి వల్ల ఉపయోగం కూడా లేదని చెబుతున్నారని మంత్రి చెప్పారు.