Annamayya District: స్క్రబ్ టైఫ్‌సతో వృద్ధురాలు మృతి
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:32 AM
రాష్ట్రంలో మరో స్క్రబ్ టైఫస్ మరణం వెలుగుచూసింది. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని మోడల్ కాలనీలో ఓ వృద్ధురాలు స్క్రబ్ టైఫ్‌సతో మృతిచెందిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
అన్నమయ్య జిల్లా పీలేరులో ఆలస్యంగా వెలుగులోకి
పీలేరు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో స్క్రబ్ టైఫస్ మరణం వెలుగుచూసింది. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని మోడల్ కాలనీలో ఓ వృద్ధురాలు స్క్రబ్ టైఫ్‌సతో మృతిచెందిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కేవీపల్లె మండలం ముప్పిరెడ్డిగారిపల్లెకు చెందిన వీరనాగయ్య, మంగమ్మ (65) దంపతులు 30 ఏళ్లుగా మోడల్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కొంతకాలం క్రితం వీరనాగయ్య పక్షవాతం బారినపడడంతో అప్పటి నుంచి దంపతులిద్దరూ సొంతూరు ముప్పిరెడ్డిగారిపల్లెలో ఉంటున్నారు. మంగమ్మ పింఛను కోసం ప్రతినెలా మోడల్ కాలనీకి వచ్చి వెళ్తుంటుంది. ఇటీవల ఆమెకు జ్వరం రావడంతో స్థానికంగా చికిత్స తీసుకున్నా తగ్గలేదు. దీంతో తిరుపతిలో ఉంటున్న ఆమె కుమారుడు గత శనివారం ఆమెను రుయా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు ఆమెకు స్క్రబ్ టైఫస్ పరీక్షలు నిర్వహించగా ఆదివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆమె కన్నుమూసింది. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య, తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ర్యాపిడ్ రెస్పాన్స్ టీం సభ్యులు బుధవారం పీలేరులోని మోడల్ కాలనీని సందర్శించారు. అధిక జ్వరంతో బాధపడుతున్నవారికి స్క్రబ్ టైఫస్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.