Generator Accident: జనరేటర్‌లోకి దూరి.. విగతజీవిగా మారి..
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:47 AM
చలి తీవ్రతకు తట్టుకోలేక ఓ వృద్ధుడు రోడ్డుపక్కన ఉన్న జనరేటర్‌లోకి దూరాడు. అయితే విద్యుదాఘాతంతో లోపలే ప్రాణాలు కోల్పోయాడు....
అనంతలో విషాదాంతం!.. 9 రోజుల తర్వాత వెలుగులోకి
అనంతపురం క్రైం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): చలి తీవ్రతకు తట్టుకోలేక ఓ వృద్ధుడు రోడ్డుపక్కన ఉన్న జనరేటర్‌లోకి దూరాడు. అయితే విద్యుదాఘాతంతో లోపలే ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం పట్టణంలో జరిగిన ఈ ఘటన తొమ్మిది రోజుల తర్వాత వెలుగుచూసింది. అనంతపురం టూటౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. సాయినగర్ మొదటి క్రాస్‌లోని భారతి ఆస్పత్రి ఎదుట జనరేటర్ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం జనరేటర్ నుంచి దుర్వాసన వస్తుండడంతో ఆస్పత్రి సిబ్బంది దాన్ని తెరచి చూడగా అందులో వృద్ధుడి మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాల ఫుటేజీని గమనించిన పోలీసులు ఈ నెల 8వ తేదీ రాత్రి 7:52 గంటల సమయంలో సుమారు 60 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వృద్ధుడు డోర్ తెరిచి అందులోకి ప్రవేశించినట్టు గుర్తించారు. ఆ తర్వాత లోపల విద్యుదాఘాతంతో మృతిచెంది ఉంటాడని గుర్తించారు. స్థానిక సచివాలయ వీఆర్వో రాజారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.