Share News

Pension Cancellation: ఆంధ్రజ్యోతి చదువుతున్నానని నాడు పింఛన్‌ రద్దు

ABN , Publish Date - Sep 08 , 2025 | 04:47 AM

తాను ఆంధ్రజ్యోతి దిన పత్రిక కొని చదువుతున్నానన్న అక్కసుతో గత ప్రభుత్వంలో తనకు వస్తున్న..

Pension Cancellation: ఆంధ్రజ్యోతి చదువుతున్నానని నాడు పింఛన్‌ రద్దు

  • పునరుద్ధరించాలని పుంగనూరు వృద్ధుడి విన్నపం

పుంగనూరు, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘తాను ఆంధ్రజ్యోతి దిన పత్రిక కొని చదువుతున్నానన్న అక్కసుతో గత ప్రభుత్వంలో తనకు వస్తున్న వృద్ధాప్య పింఛను రద్దు చేశార’ని ఆదివారం పుంగనూరుకు చెందిన ఎ.రాచప్పశెట్టి అనే వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరు ఉర్దూ హైస్కూల్‌ సమీపంలోని కేకే వీధికి చెందిన ఎ.వీరప్పశెట్టి కుమారుడు ఎ.రాచప్పశెట్టి 1954 జనవరి 11న జన్మించారు. ఈయనకు గతంలో రేషన్‌కార్డు ఉండగా గత వైసీపీ ప్రభుత్వం వృద్ధాప్య పింఛను (ఐడీ నంబరు 110995129) మంజూరు చేసింది. 2020 ఆగస్టు వరకు నెలకు రూ.2250 చొప్పున పింఛన్‌ మొత్తాన్ని ఆ ప్రాంత వలంటీరు సుమ అందజేశారు. అయితే ఆ తర్వాత.. తాను ఆంధ్రజ్యోతి దిన పత్రిక చదువుతుండగా వైసీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు చూశారని, ‘సాక్షి’ పత్రిక కాకుండా ‘ఆంధ్రజ్యోతి’ చదువుతావా’ అంటూ వెళ్లి అన్యాయంగా వృద్ధాప్య పింఛను రద్దు చేయించారని వాపోయారు. 71 ఏళ్ల వయసులో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని, రద్దు చేసిన వృద్ధాప్య పింఛను తిరిగి ఇప్పించాలని ఐదేళ్లుగా పలుమార్లు అధికారులకు అర్జీలు ఇచ్చినా ఫలితం దక్కలేదని రాచప్పశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు పింఛను మంజూరు చేయాలని కోరుతున్నారు.

Updated Date - Sep 08 , 2025 | 04:47 AM