Union Minister Jual Oram: చదువుతో పాటు సంస్కృతీ అలవర్చుకోవాలి
ABN , Publish Date - Dec 04 , 2025 | 06:00 AM
రిజన విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు కూడా నేర్చుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్ సూచించారు.
‘ఏకలవ్య’ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణించాలి
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరమ్ సూచన
ఉద్భవ్-2025 ఉత్సవాల ఏర్పాట్లు అద్భుతమని ప్రశంస
అమరావతి/తాడేపల్లి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు కూడా నేర్చుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్ సూచించారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్‌ఎస్) విద్యార్థుల ఆరో జాతీయ కల్చరల్, లిటరరీ ఫెస్ట్-కళా ఉత్సవ్.. ‘ఉద్భవ్-2025’ను బుధవారం అమరావతిలోని కేఎల్ యూనివర్సిటీ వేదికగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏకలవ్య స్కూళ్ల బాలబాలికలు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు. ‘విద్యార్థులకు హిందీ, ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాష కూడా ముఖ్యమే. జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్ల తరహాలోనే ఈఎంఆర్‌ఎస్ పాఠశాలలను అభివృద్ధి చేస్తాం.. క్రీడల్లో కూడా గిరిజన విద్యార్థులు మెరుస్తున్నారు’ అని తెలిపారు. ఎంతో కష్టపడి ఎలాంటి లోటుపాట్లూ లేకుండా నిర్వహిస్తోన్న ఏపీ ప్రభుత్వం, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ముఖ్యకార్యదర్శి ఎం.మల్లికార్జున్ నాయక్‌లను ఆయన అభినందించారు. అనంతరం ఆయన్ను సంధ్యారాణి సన్మానించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూుకరించారు. అంతకుముందు ఓరమ్‌కు ఈఎంఆర్‌ఎస్ విద్యార్థులు గిరిజన సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. సభా ప్రాంగణం వద్ద గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన ప్రదర్శనను, బొమ్మలను ఆయన ఆసక్తిగా తిలకించారు. బాణం ఎక్కుపెట్టి సందడి చేశారు.
ఉద్భవ్.. మార్పునకు వేదిక: సంధ్యారాణి
ఉద్భవ్-2025 అంటే వేడుక కాదని.. గొప్ప మార్పునకు వేదికని సంధ్యారాణి అభివర్ణించారు. 405 ఈఎంఆర్‌ఎస్ స్కూళ్ల నుంచి 1,647 మంది తరలివచ్చారని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంత పెద్దసంఖ్యలో చిన్నారులు పాల్గొనే వేదిక ఏపీ కావడం సంతోషకరమన్నారు. 110 మంది ఏపీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన బిడ్డల చదువు, పాఠశాల వసతులకు మరిన్ని నిధులివ్వాలని కేంద్రమంత్రిని అభ్యర్థించారు. గిరిజనులుండే మారుమూల ప్రాంతంలో రోడ్ల నిర్మాణం, అనుసంధానికి ప్రాధాన్యమివ్వాలని, మరిన్ని ఈఎంఆర్‌ఎస్ స్కూళ్లను మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ హసన్ బాషా, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ డైరక్టర్ సదా భార్గవి, గురుకులం కార్యదర్శి ఎం.గౌతమి, కేఎల్ వర్సిటీ డీన్ ప్రొఫెసర్ జీపీఎస్ వర్మ, గిరిజన నాయకుడు ధారూనాయక్ పాల్గొన్నారు.
