Stampede Incidents: తిరుపతి, కుంభమేళా నుంచి కాశీబుగ్గ వరకూ...
ABN , Publish Date - Nov 02 , 2025 | 06:28 AM
ఈ ఏడాది ఆరంభంలో తిరుపతి, ఆ తరువాత కుంభమేళా దగ్గర నుంచి ఇప్పుడు కాశీబుగ్గ వరకూ ఏడు పెద్ద తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ ఏడాది తొక్కిసలాట ఘటనలు... సుమారు 120 మంది మృతి
పదుల సంఖ్యలో గాయపడ్డ ప్రజలు
అమరావతి, నవంబరు 1: ఈ ఏడాది ఆరంభంలో తిరుపతి, ఆ తరువాత కుంభమేళా దగ్గర నుంచి ఇప్పుడు కాశీబుగ్గ వరకూ ఏడు పెద్ద తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయా దుర్ఘటనల్లో సుమారుగా మొత్తం 120 మంది వరకూ మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్య లో గాయాలపాలయ్యారు.
జనవరి 8
తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం తిరుపతిలోని బైరాగి పట్టెడ వద్ద క్యూలైన్లలో భారీగా భక్తులు వేచి ఉ న్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా... 20 మందికిపైగా గాయపడ్డారు.
జనవరి 29
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. జనవరి 29న మౌని అమావస్యనాడు అమృతస్నానం ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. అప్పుడు జరిగిన ఘటనలో 30మంది మృతిచెందారు.
ఫిబ్రవరి 15
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఫిబ్రవరి 15న మరో దుర్ఘటన చోటు చేసుకుంది. మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగరాజ్ వెళ్లడానికి పెద్దసంఖ్యలో ప్రయాణికులు వేచి ఉన్నారు. రైలు వచ్చిందన్న సమాచారంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పైకి ఒక్కసారిగా కదిలారు. నాడు జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు పిల్లలతో సహా 18 మంది చనిపోయారు. సుమారుగా 12 మందికిపైగా గాయపడ్డారు.
ఏప్రిల్ 30
సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కోసం క్యూలైన్‌లో ఉన్న ఏడుగురు భక్తులు భారీవర్షానికి గోడ కూలి పడటంతో దుర్మరణం పాలయ్యారు.
మే 3
ఉత్తర గోవాలోని షిర్గావ్ గ్రామంలో మరో ఘటన చోటు చేసుకుంది. మే 3న ఏటా జరిగే ఉత్సవం ఊరేగింపు నిమిత్తం భక్తులు పెద్ద ఎత్తున షిర్గావ్ ఆలయం వద్ద గుమిగూడారు. హఠాత్తుగా భయాందోళనలు చెలరేగి తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనీసం ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
జూన్ 4
పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఐపీఎల్ కప్పును ఆర్‌సీబీ గెలుచుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు.
సెప్టెంబరు 27
తమిళనాడులోని కరూర్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్... రాష్ట్రవ్యాప్త రాజకీయ పర్యటనలో భాగంగా వేలుసామిపురంలో సభ నిర్వహించారు. విజయ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇరుకు రహదారులు జనంతో కిక్కిరిశాయి. విజయ్ రాగానే ఒక్కసారిగా చోటుచేసుకున్న తోపులాటలో కనీసం 40 మంది వరకూ చనిపోయారు.