Share News

Egg Price Hike: గుడ్డు ధర పైపైకి..

ABN , Publish Date - Dec 13 , 2025 | 04:42 AM

గుడ్డు ధర దూసుకెళ్తోంది! రాష్ట్రంలో శనివారం మార్కెట్‌లో అమ్మాల్సిన గుడ్ల ధరను శుక్రవారం సాయంత్రమే నిర్ణయించి ప్రకటిస్తారు.

Egg Price Hike: గుడ్డు ధర పైపైకి..

విశాఖలో 100 గుడ్ల హోల్‌సేల్‌ ధర రూ.660

విజయవాడలో రూ.690

ధర మరింత పెరిగే అవకాశం

డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడమే కారణం

విశాఖపట్నం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): గుడ్డు ధర దూసుకెళ్తోంది! రాష్ట్రంలో శనివారం మార్కెట్‌లో అమ్మాల్సిన గుడ్ల ధరను శుక్రవారం సాయంత్రమే నిర్ణయించి ప్రకటిస్తారు. ఈ మేరకు శనివారం ధరలు చూస్తే హోల్‌సేల్‌గా 100 గుడ్ల ధర విశాఖలో రూ.660గా నిర్ణయించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ.664గా ఖరారు చేశారు. రాష్ట్రంలో ఐదు నెక్‌ సెంటర్లు (గుడ్లు రేట్లు, మార్కెట్లలో సరఫరాను పర్యవేక్షించేవి) ఉండగా... అనపర్తి, తణుకుల్లో 100 గుడ్లు రూ.665, విజయవాడలో రూ.690, చిత్తూరులో రూ.663గా నిర్ణయించారు. పొరుగున ఉన్న హైదరాబాద్‌లో రూ.656గా ఉంది. అయితే గురువారం ఒడిశాలోని బరంపురంలో రూ.690, చెన్నైలో రూ.670గా ఉంది. మార్కెట్‌ డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి లేకపోవడంతో ధర పెరుగుతోందని నెక్‌ వర్గాలు చెబుతున్నాయి. 3నెలల క్రితం గుడ్లుపెట్టే కోళ్లకు వ్యాధులు సోకాయి. దాంతో కోళ్లు గణనీయంగా తగ్గాయి. గుడ్ల ఉత్పత్తీ భారీగా పడిపోయింది. ఫారాల్లో పిల్లలు పెరిగి గుడ్లు పెట్టే దశకు రావాలంటే 3 నెలలు పడుతుంది. అందువల్ల రెండు నెలల నుంచి బాగా ఉత్పత్తి తగ్గింది. జనవరి మూడో వారం తర్వాత గుడ్ల ఉత్పత్తి పెరుగుతుందని, అప్పటివరకూ ధరలు ఎక్కువగానే ఉంటాయని రైతులు అంటున్నారు. ఉత్తరాంధ్రలో 75 ఫారాల్లో ప్రతిరోజూ 40-42 లక్షల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. కానీ గత రెండు నెలలుగా 36-38 లక్షలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఈశాన్య భారతం, ఉత్తరాదికి గుడ్ల ఎగుమతి పెరగడంతో స్థానిక మార్కెట్లలో కొరత వచ్చిందని, ధర పెరగడానికి అదీ ఒక కారణమని రైతులు పేర్కొంటున్నారు.

Updated Date - Dec 13 , 2025 | 04:42 AM