Share News

AP NJGO: ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం

ABN , Publish Date - Nov 03 , 2025 | 06:54 AM

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హెల్త్‌కార్డులపై మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేయడమే లక్ష్యమని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ స్పష్టం చేశారు.

AP NJGO: ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం

ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ విజయవాడ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హెల్త్‌కార్డులపై మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేయడమే లక్ష్యమని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ స్పష్టం చేశారు. విజయవాడలోని ఎన్జీజీవో హోమ్‌లో ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 26 జిల్లాల నాయకుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు నగదు రహిత వైద్యసేవలు అందించడానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని, మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ కోసం ఉద్యోగులు పెట్టుకున్న బిల్లులు ఏళ్ల తరబడి స్ర్కూటినీలోనే మగ్గుతున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హెల్త్‌కార్డులపై దృష్టి సారించారని, ఒక కమిటీని ఏర్పాటుచేసి 60 రోజుల్లోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామనడం శుభపరిణామన్నారు. ఉద్యోగులకు వైద్యసేవల్లో సమస్యలు సరిచేస్తూ, వీలు కుదిరితే ఇన్సూరెన్స్‌ కింద హెల్త్‌కార్డు సేవలను తేవాలనే లక్ష్యంతో ఏపీ ఎన్జీజీవో సంఘం పనిచేస్తుందని, దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కమిటీని నియమించి పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగ సంఘాలను పిలిపించి, వారి సమస్యలు విని, డీఏ విడుదల, మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్‌ లీవ్‌, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం వంటి అంశాల్లో తీసుకున్న నిర్ణయాలు సంతోషకరమని విద్యాసాగర్‌ పేర్కొన్నారు. ఏపీఎన్జీవో 75 సంవత్సరాల వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘ కోశాధికారిగా భారతీప్రసాద్‌ను కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

Updated Date - Nov 03 , 2025 | 06:54 AM