Andhra Pradesh Assembly: సోలార్ విద్యుదుత్పత్తి పెంచేందుకు కృషి
ABN , Publish Date - Sep 19 , 2025 | 05:26 AM
సోలార్ విద్యుదుత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు రుణాలు మంజూరు చేసేలా బ్యాంకర్లతో...
బ్యాంకుల నుంచి రుణాలు: గొట్టిపాటి
అంగన్వాడీల్లో పౌష్టికాహారం: సంధ్యారాణి
టిడ్కో ఇళ్ల సమస్యలపై చర్చిద్దాం: స్పీకర్
అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): సోలార్ విద్యుదుత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు రుణాలు మంజూరు చేసేలా బ్యాంకర్లతో ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపినట్లు అసెంబ్లీలో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, వసంత కృష్ణప్రసాద్, అరిమిల్లి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2022లో రియల్ టైమ్ ఎనర్జీ విధానంలో భాగంగా ఏ రోజు ఉత్పత్తి ఆ రోజే వాడాలన్న నిబంధన తీసుకురావడం వల్ల పారిశ్రామిక రంగం అభివృద్ధిలో కుంటుపడిందని వసంత కృష్ణప్రసాద్ సభ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని సమస్యలపై సమీక్షిస్తున్నామని, సోలార్ విద్యుదుత్పత్తిని 78.50 గిగా వాట్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 55 వేల అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి విద్యార్థికి పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన భోజనం పెడుతున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అంగన్వాడీలను బలోపేతం చేయాలని, అందులో పిల్లలకు ఐక్యూ పెరిగేలా బలవర్ధక ఆహారం అందించాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు. మంత్రి స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్నీ పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాలు రూ.11,500 చెల్లిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ సభ్యులు సభకు రాకపోవడంతో ఐదు ప్రశ్నలు వాయిదా పడ్డాయి. వాటికి సంబంధిత శాఖల మంత్రులు లిఖితపూర్వకంగా సమాధానం తెలిపారు.
అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్‌డీటీ)కు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అథారిటీ(ఎ్‌ఫసీఆర్‌ఏ) రెన్యువల్ చేయించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర కోరారు. అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు, ఆసుపత్రులు, పేద విద్యార్థులకు క్రీడలు, భూగర్భ నీటి వనరులు పెంచేందుకు చెక్ డ్యామ్‌లు ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టిన ఆర్డీటీ నిధుల కొరతతో అభివృద్ధి పనులు చేయలేకపోతోందని సభ దృష్టికి తీసుకొచ్చారు.
రాష్ట్రంలోని కో-ఆపరేటివ్ సొసైటీలపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకపోవడం వల్ల వారే సొంత ఆడిట్ చేసుకొంటూ ప్రజల్ని తరచూ ముంచేస్తున్నారంటూ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
ఆటో, క్యాబ్‌లపై భారీగా జరిమానాల విధింపునకు కారణమైన జీవో 21 రద్దు చేయాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కోరారు.
టిడ్కో ఇళ్ల సమస్యలపై బీజేపీ సభ్యులు విష్ణుకుమార్‌రాజు, ఈశ్వరరావు ప్రస్తావించారు. స్పీకర్ స్పందిస్తూ.. ‘ఇది ముఖ్యమైన అంశం. ఒకరిద్దరి ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తే సరిపోదు. స్వల్పకాలిక చర్చ పెట్టి చర్చిద్దాం. సభ్యులు నోటీసు ఇవ్వండి’ అని సూచించారు.
మంత్రులు ప్రశ్నలు నోట్ చేసుకోవాలి: అయ్యన్న
అసెంబ్లీలో సభ్యులు జీరో అవర్‌లో ప్రస్తావిస్తున్న ప్రశ్నలను మంత్రులు ఎవరైనా నోట్ చేసుకుని సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. సభలో తాము ప్రస్తావిస్తున్న సమస్యలపై ఎలాంటి సమాధానం రావట్లేదని సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పీకర్ ఇలా స్పందించారు.