వైద్య రంగం అభివృద్ధికి కృషి చేయాలి
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:56 PM
రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్ధికి డాక్టర్ వరుణ్‌కుమార్ కృషి చేయాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డి అన్నారు.
ప్రొద్దుటూరు టౌన్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్ధికి డాక్టర్ వరుణ్‌కుమార్ కృషి చేయాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఉపాధ్యాయ సేవా కేంద్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా నియమితులైన డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డిని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిఽథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రొద్దుటూరుకు డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి అంతే అవసరమన్నారు. వైద్యం తెలిసిన ఆయనను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సభ్యునిగా నియమించడం హర్షణీయమన్నారు. ఒంటేరు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సభ్యునిగా వరుణ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారని తెలిపారు. ఆయన కరోనా సమయంలో తక్కువ ఖర్చుతో ఎందరో పేద ప్రజల ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు. డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఒంటేరు శ్రీనివాసులరెడ్డి సహకారంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సభ్యునిగా నియమితులయ్యానన్నారు. వైద్య విద్యలో నైతిక విలువలు పెంచడానికి కృషి చేస్తానన్నారు.