Share News

CM Chandrababu Naidu: సమర్థత, అనుభవం ఫలితమే చార్జీల తగ్గింపు

ABN , Publish Date - Sep 29 , 2025 | 02:56 AM

వైసీపీ హయాంలో ఎప్పుడు చూసినా ట్రూ-అప్‌ ప్రతిపాదనలే ఉండేవి. కానీ తొలిసారి ట్రూడౌన్‌ వచ్చేలా చేశాం. ఇలా ఆదా చేసిన డబ్బుతో ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారాన్ని తగ్గిస్తున్నాం

CM Chandrababu Naidu: సమర్థత, అనుభవం ఫలితమే చార్జీల తగ్గింపు

  • విద్యుత్‌ వ్యవస్థను గాడిన పెట్టాం.. రూ.1,000 కోట్లు ఆదా చేశాం

  • తక్కువ ధరకు కరెంటు కొనుగోళ్లు, సమర్థ నిర్వహణతోనే సాధ్యమైంది

  • ‘యోగాంధ్ర’ను మించిన స్థాయిలో ‘సూపర్‌ జీఎ్‌సటీ.. సూపర్‌ సేవింగ్స్‌’

  • అసెంబ్లీకి వైసీపీ డుమ్మా.. మండలిలో డ్రామా.. ఫేక్‌ ప్రచారమే ఆ పార్టీ

  • రాజకీయానికి పునాది.. ఏ ఎన్నికలొచ్చినా కూటమే గెలవాలి: సీఎం

  • మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌

రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను.. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుగానే సమీక్షించుకుని తక్కువ ధరకు కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకున్నాం. ఇతర రాష్ట్రాలతో మాట్లాడుకుని స్వాపింగ్‌ విధానాన్ని అవలంబించి వెయ్యి కోట్లు ఆదా చేయగలిగాం.

జీఎస్‌టీ సంస్కరణలతో మన రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్లు ఆదా అవుతాయి. రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గినా సంస్కరణల వల్ల జనం ఆర్థికంగా బలోపేతమవుతారు.రోజుకు 150 టీఎంసీల చొప్పున.. ఏటా 6 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఒక రోజు సముద్రంలో కలిసే నీటిని ఉపయోగించుకుంటే కరువనేది లేకుండా చేయొచ్చు.

- సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ హయాంలో ఎప్పుడు చూసినా ట్రూ-అప్‌ ప్రతిపాదనలే ఉండేవి. కానీ తొలిసారి ట్రూడౌన్‌ వచ్చేలా చేశాం. ఇలా ఆదా చేసిన డబ్బుతో ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారాన్ని తగ్గిస్తున్నాం. సమర్థతకు.. అనుభవానికి వచ్చిన ఫలితమిది. దీని వల్ల ప్రజలపై రూ.1,000 కోట్ల భారం తగ్గింది.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టి, సక్రమంగా నిర్వహించినప్పుడు, సంస్కరణలను సమర్థంగా అమలు చేసినప్పుడు ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో ఆయన ఆదివారం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జీఎస్‌టీ సంస్కరణలతో పన్నుల తగ్గి సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరగా.. విద్యుత్‌ వ్యవస్థను గాడిలో పెట్టి తక్కువ ధరకు కరెంటు కొనుగోళ్లు చేపట్టడం వల్ల సుమారు రూ.వెయ్యి ఆదా చేయగలిగామన్నారు.


జీఎస్‌టీ సంస్కరణలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని మించిన స్థాయిలో ‘సూపర్‌ జీఎస్‌టీ .. సూపర్‌ సేవింగ్స్‌’ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. జీఎస్‌టీ సంస్కరణల ఫలాలను ప్రజలకు వివరించేందుకు అక్టోబరు 19 వరకు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అందులో భాగంగా సుమారు 60 వేల సమావేశాలు నిర్వహించి, 1.60 కోట్ల కుటుంబాలను కలిసి, జీఎ్‌సటీ 2.0 ప్రయోజనాలను వారికి వివరించాలన్నారు. ‘జీఎస్‌టీ 2.0 సంస్కరణలు దేశ చరిత్రలో నూతన అధ్యాయం. పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులను జీఎస్‌టీ ఉత్సవ్‌లో భాగంగా ప్రజలకు వివరిద్దాం. ఈ సంస్కరణల ప్రభావం పారిశ్రామిక, ఆటోమొబైల్‌, ఫార్మా వంటి రంగాలపై పూర్తిగా కనిపిస్తోంది. ఆ రంగాల అభివృద్ధికి ఇవి దోహదపడతాయి. ద్విచక్ర వాహనాలు, ఏసీలు, కార్లు వంటి వాటిపై జీఎస్‌టీ బాగా తగ్గింది. ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువుల ధరలు భారీగా తగ్గాయి. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంపై ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేశాం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఏడాదిలో ప్రజలకు ఏం చేశామో వివరించాం. అదే తరహాలో జీఎస్‌టీ ఉత్సవ్‌ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి’ అని పిలుపిచ్చారు. ఇంకా ఏమన్నారంటే..


గత ప్రభుత్వం నాశనం చేసింది..

గత ప్రభుత్వం విద్యుత్‌ వ్యవస్థను నాశనం చేసింది. ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోళ్లు చేపట్టింది. దీంతో విద్యుత్‌ చార్జీల కొనుగోళ్ల భారం ప్రజలపై పడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌ వ్యవస్థను గాడిలో పెట్టాం. ప్రభుత్వ డబ్బులే కదా.. ఖర్చయిపోతే మనకేంలే అనుకోలేదు. ప్రతి రూపాయినీ బాధ్యతాయుతంగా ఖర్చు చేస్తున్నాం.

సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌

సూపర్‌ సిక్స్‌ పథకాలు హిట్‌ అయ్యాయి. ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మెగా డీఎస్సీ.. మెగా హిట్‌ అయింది. నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొనప్పుడు వారి కళ్లలో ఆనందం చూసి చాలా సంతోషించా. 15 నెలల కాలంలో 4.71 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం. తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, దీపం-2.0 వంటి పథకాలు సక్సెస్‌ చేశాం. అన్న క్యాంటీన్ల ద్వారా పేదల కడుపులు నింపుతున్నాం. మరే ఇతర రాష్ట్రంలోనూ ఇవ్వనన్ని పింఛన్లు ఇస్తున్నాం. హంద్రీ-నీవా పూర్తి చేసి కుప్పంకు నీళ్లు ఇచ్చాం. పోలవరం పూర్తి చేస్తున్నాం. ఇతర సాగునీటి ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. అక్టోబరు 4న ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రతి లబ్ధిదారుకూ రూ.15 వేలు ఇస్తాం. ఏ ఎన్నిక వచ్చినా కూటమి పార్టీలదే గెలుపు అన్నట్లుగా ఉండాలి. ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై అనునిత్యం ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నాం. అదే విధంగా నేతల పనితీరు మీదా ఫీడ్‌బ్యాక్‌ తెప్పించుకుంటున్నాం. పార్టీ, ప్రజల కోసం పనిచేసే వారే నాకు దగ్గరవుతారు. మాటలు చెప్పి కాలక్షేపం చేసేవారికి నా దగ్గర స్థానం లేదు.


తప్పుడు ప్రచారమే వైసీపీ ఆచారం

రాష్ట్రంలో ప్రభుత్వంపై ఫేక్‌ ప్రచారం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుంది. తప్పుడు పోస్టులు పెడుతూ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు. వాళ్లు పెట్టే ఒక్క పోస్టుకూ ఆధారం ఉండదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారు. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు. మండలిలో మాత్రం రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. ప్రభుత్వం చేసే మంచి పనినే కాదు.. వైసీపీ చేసే దుష్ప్రచారాలను.. డ్రామాలను కూడా ప్రజలకు వివరించాలి. ఈ బాధ్యతను నేతలు, కార్యకర్తలు తీసుకోవాలి.


కరెంటు చార్జీలు మరింత తగ్గిస్తాం

జగన్‌ ట్రూఅ్‌పతో బాదితే.. మేం

ట్రూడౌన్‌తో ఊరట ఇస్తున్నాం: గొట్టిపాటి

విద్యుత్‌ చార్జీలు పెంచబోమని, వీలైతే తగ్గిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని విద్యుత్‌ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లిలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో సుమారు రూ.1,000 కోట్లను ఆదా చేసి, ప్రజలకు లబ్ధి చేకూర్చామని.. రానున్న రోజుల్లో విద్యుత్‌ చార్జీల భారాన్ని మరింతగా తగ్గిస్తామని ప్రకటించారు. ‘జగన్‌ ఐదేళ్లూ ట్రూఅప్‌ అంటూ జనాలను బాదితే.. మేం 15 నెలల్లోనే ట్రూడౌన్‌ అంటూ విద్యుత్‌ చార్జీల నుంచి ఊరట కలిగించాం. ఆదా చేసిన మొత్తాన్ని ఈ ఏడాది నవంబరు నుంచి యూనిట్‌కు 13 పైసల చొప్పున విద్యుత్‌ బిల్లుల్లో సర్దుబాటు చేసి వినియోగదారులకు లబ్ధి చేకూరుస్తాం. 2014లో లోటు విద్యుత్‌ నుంచి 2109 నాటికి మిగులు విద్యుత్‌ సాధించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే. 2019లో జగన్‌ వచ్చాక విద్యుత్‌ వ్యవస్థను నాశనం చేశారు. మళ్లీ లోటులోకి తీసుకెళ్లారు. 9 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై రూ.18 వేల కోట్ల భారం మోపారు. ఇంధన రంగానికి రూ.1.25 కోట్లు నష్టం కలిగించారు. వైసీపీ ప్రభుత్వం ప్రొవిజనల్‌ కలెక్షన్‌ పేరుతో 2024-25లో యూనిట్‌కు అదనంగా 40 పైసలు వసూలు చేసుకునేలా ధరను నిర్ణయించింది. అందులో 13 పైసలు ఆదా చేసిన కూటమి ప్రభుత్వం.. తిరిగి వాటిని ప్రజలకు ఇస్తోంది. జగన్‌ కక్ష సాధింపుధోరణితో పీపీఏ రద్దు చేయడంతో అంతర్జాతీయ సమాజంలో తలదించుకోవడంతోపాటు రూ.9వేల కోట్ల పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. 17 శాతం ఉన్న షార్ట్‌ టర్మ్‌ విద్యుత్‌ కొనుగోళ్లను కూటమి ప్రభుత్వం 6.8 శాతానికి తీసుకొచ్చింది. స్వాపింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టి మన వద్ద అదనపు విద్యుత్‌ ఉన్నప్పుడు.. పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలకు ఇచ్చి మనకు అవసరం ఉన్నప్పుడు వారి నుంచి తీసుకునే దిశగా పనిచేస్తున్నాం. ఏఐ పరిజ్ఞానం ద్వారా వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేస్తూ విద్యుత్‌ డిమాండ్‌ అంచనా వేయగలుగుతున్నాం. తద్వారా డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేయగలుగుతున్నాం’ అని వివరించారు.

Updated Date - Sep 29 , 2025 | 02:58 AM