Share News

CM Chandrababu Naidu: జలాశయాలు కళకళ

ABN , Publish Date - Aug 26 , 2025 | 06:19 AM

రాష్ట్రంలోని జలాశయాలకు జలకళ వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. సమర్థ నీటి యాజమాన్య నిర్వహణతో సత్ఫలితాలు సాధించామన్నారు.

CM Chandrababu Naidu: జలాశయాలు కళకళ

  • సమర్థ నీటి యాజమాన్య నిర్వహణతో సత్ఫలితాలు: సీఎం

  • హంద్రీ-నీవా విస్తరణతో కుప్పం చేరిన కృష్ణా జలాలు

  • శ్రీశైలం నుంచి 738 కి.మీ ప్రయాణం

  • సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జలాశయాలకు జలకళ వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. సమర్థ నీటి యాజమాన్య నిర్వహణతో సత్ఫలితాలు సాధించామన్నారు. హంద్రీ-నీవా కాలువ విస్తరణ, సమగ్ర నీటి యాజమాన్య నిర్వహణపై సోమవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక సీఎస్‌ సాయిప్రసాద్‌, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు హంద్రీ-నీవా కాలువల గుండా 738 కిమీ ప్రయాణించి కుప్పం చేరాయని అధికారులు చెప్పినప్పుడు.. సంకల్పంతో పనిచేశామని, ఫలితం సాధించామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జల వనరుల శాఖ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అందించింది. ‘రాష్ట్రంలోని రిజర్వాయర్లు 90 శాతానికి పైగా నిండాయి. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నదుల ద్వారా ఇప్పటికే 310 టీఎంసీల వినియోగం జరిగింది. హంద్రీ-నీవా ద్వారా సీమ ప్రాజెక్టులకు సమృద్ధిగా నీళ్లు చేరాయి’ అని అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 70 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజీ నుంచి 52 టీఎంసీలు, వంశధార నుంచి 8 టీఎంసీలను కాలువల ద్వారా సాగుకు అందించామన్నారు. ఇదే సమయంలో 1,969 టీఎంసీల వరద సముద్రం పాలైందన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 06:20 AM