Share News

ED: గోల్డ్‌ కవరింగ్‌

ABN , Publish Date - Sep 20 , 2025 | 04:55 AM

హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్‌, రాయ్‌పూర్‌, ఢిల్లీతోపాటు ఏపీలో ఏకకాలంలో 20చోట్ల గురువారం సోదాలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది.

ED: గోల్డ్‌ కవరింగ్‌

  • ముడుపుల సొమ్ములు మళ్లించారు

  • సంబంధంలేని వ్యక్తులు, సంస్థలకు చెల్లింపులు

  • షెల్‌ కంపెనీలతో విదేశాలకు తరలించారు

  • కీలక డాక్యుమెంట్లు, 38 లక్షల నగదు స్వాధీనం

  • గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్ లోనూ సోదాలు జరిపాం

  • తనిఖీలపై ఈడీ అధికారిక ప్రకటన

మద్యం ముడుపులు ‘బంగారుబాట’ పట్టాయని నిరూపించే కీలక ఆధారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సేకరించింది. ముడుపుల సొమ్ము కోసం వాడుకున్న షెల్‌ కంపెనీలు, నిందితుల దుబాయ్‌ లింకులను గుర్తించింది. జగన్‌ హయాంలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌లో ‘మనీ లాండరింగ్‌’ కోణంలో ఈడీ తన దర్యాప్తు మొదలుపెట్టింది. గురువారం దేశవ్యాప్తంగా జరిపిన సోదాల వివరాలతో శుక్రవారం ఈడీ హైదరాబాద్‌ జోన్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిని రూ.4వేల కోట్ల స్కామ్‌గా పేర్కొంది.

(హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి)

హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్‌, రాయ్‌పూర్‌, ఢిల్లీతోపాటు ఏపీలో ఏకకాలంలో 20చోట్ల గురువారం సోదాలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. లిక్కర్‌ స్కామ్‌ ముడుపులను మళ్లించిన కంపెనీల్లో, లావాదేవీలను అతిగా చూపించిన సంస్థల్లో ఈ సోదాలు జరిపినట్లు తెలిపింది. ‘‘బోగస్‌ ఇన్‌వాయి్‌సలు, ట్రాన్స్‌పోర్టు చలాన్లు, నాన్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాల వివరాలు, మద్యం ధరల పెంపుదల, ముడుపులకు సంబంధించిన డాక్యుమెంట్లు, రూ.38 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నాం. వాట్సాప్‌ సంభాషణలూ గుర్తించాం. పరారీలో ఉన్న నిందితుల్లో కొందరు దుబాయ్‌లో ఉన్నారు. ఇక్కడి నుంచి వారికి చేరిన కోట్లాది రూపాయల ముడుపులకు చెందిన లెడ్జర్‌ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నాం. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌, ఆ తర్వాత సిట్‌ దర్యాప్తు ఆధారంగా మనీలాండరింగ్‌ కోణంలో... రూ.4000 కోట్ల ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో దర్యాప్తు ప్రారంభించాం. సిట్‌ ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం... ఈ కేసులో నిందితులు కొన్ని బ్రాండ్లను చంపేశారు. మరికొన్ని బ్రాండ్లను ప్రమోట్‌ చేశారు. ముడుపులు ఇవ్వడానికి నిరాకరించిన మెక్‌డోవల్‌, రాయల్‌స్టాగ్‌, ఇంపీరియల్‌ బ్లూ లాంటి బ్రాండ్లను తప్పించి... పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చిన కొన్ని డిస్టిలరీల బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేశారు. గతంలో లిక్కర్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ఆటోమెటేడ్‌గా ఉండేది. దానిని మాన్యువల్‌గా మార్చి... ఆర్డర్‌ ఆఫ్‌ సప్లై విధానం తారుమారు చేశారు. తద్వారా ప్రతి ఇన్‌వాయి్‌సకు డిస్టిలరీల యజమానులు 15శాతం నుంచి 20శాతం ముడుపులు చెల్లించారని, ఆ సొమ్మును ప్రత్యేక పద్దతుల్లో షెల్‌ కంపెనీల ద్వారా చేరాల్సిన చోటికి చేర్చారని సిట్‌ తన చార్జిషీట్లలో పేర్కొంది. తమకు కావాల్సిన అధికారులను కీలక స్థానాల్లో నియమించుకోవడం ద్వారా ఆర్డర్‌-సరఫరా-ముడుపులను ఒక పథకం ప్రకారం విదేశాలకు తరలించినట్లు సిట్‌ వెల్లడించింది. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి మద్యం సరఫరాదారులకు జరిగిన చెల్లింపులు చాలావరకు బోగ్‌సగా గుర్తించాం. సంబంధం లేని కంపెనీలకు, వ్యక్తులకు డబ్బు మళ్లింది. వస్తువులు సరఫరా చేశారని, సేవలు అందిచారని చెబుతూ... సొమ్ములు చెల్లించారు. ఇవన్నీ బోగస్‌ లావాదేవీలుగా నిర్ధారణ అయ్యింది. ఉనికిలో లేని/షెల్‌కంపెనీలు/సంబంధంలేని వ్యక్తులకు సొమ్ములు చేరాయి. ఇలా అందిన ముడుపులను కొన్ని జ్యువెలరీ కంపెనీలకు మళ్లించి... బంగారాన్ని కొన్నట్లుగా చూపించినట్లు మా దర్యాప్తులో స్పష్టమైంది. వ్యాపార లావాదేవీల ముసుగులో అక్రమ సొమ్మును షెల్‌ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారు’’ అని ఈడీ వెల్లడించింది.

Updated Date - Sep 20 , 2025 | 04:56 AM