Money Laundering: దుబాయి రియల్ ఎస్టేట్‌లో మనోళ్ల పెట్టుబడులు.. ఈడీ నోటీస్‌లు
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:00 AM
ఆదాయ పన్ను ఎగవేతలను పకడ్బందీగా అడ్డుకునే క్రమంలో భాగంగా పటిష్ఠ నిబంధనలతో పట్టు బిగిస్తున్న సర్కారు.. చట్టాల్లో లొసుగులను వాడుకుని, అడ్డదారి మార్గాల్లో అడ్డగోలుగా సంపాదించిన నల్ల సొమ్ముతో...
అవినీతి సొమ్ముతో ఎమిరేట్లలో ఏపీ, తెలంగాణ నేతల స్థిరాస్తుల కొనుగోళ్లు
క్రిప్టో, హవాలా మార్గాల్లో చెల్లింపులు.. అద్దె రూపంలో ఏటా 10-15శాతం రాబడి
సంపాదనను రిటర్నుల్లో చూపకుండా పన్ను ఎగవేస్తున్నవారిపై ఐటీ కన్ను
రహస్య మార్గాల్లో వివరాల సేకరణ.. వాటి ఆధారంగా నోటీసులిస్తున్న ఈడీ
(‘ఆంధ్రజ్యోతి’ గల్ఫ్ ప్రతినిధి)
ఆదాయ పన్ను ఎగవేతలను పకడ్బందీగా అడ్డుకునే క్రమంలో భాగంగా పటిష్ఠ నిబంధనలతో పట్టు బిగిస్తున్న సర్కారు.. చట్టాల్లో లొసుగులను వాడుకుని, అడ్డదారి మార్గాల్లో అడ్డగోలుగా సంపాదించిన నల్ల సొమ్ముతో విదేశాల్లో స్థిరాస్తులను కొనుగోలు చేస్తున్న అక్రమార్కులపై దృష్టి సారించింది! అందులో భాగంగానే.. దుబాయిలో ఇళ్లు కొంటున్నవారి వివరాలు సేకరిస్తోంది. అలా ఇప్పటికే గుర్తించినవారికి ఏడాది క్రితమే ఐటీ శాఖ నోటీసులు పంపగా.. ఇప్పుడు ఈడీ నుంచి కూడా వారికి శ్రీముఖాలు అందుతున్నాయి. వారిలో పలువురు తెలుగు రాజకీయ ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది! దుబాయి అంటే సగటు తెలుగువాడి దృష్టిలో.. రెక్కల కష్టం చేసుకుంటే నాలుగు రాళ్లు సంపాదించిపెట్టే నగరం! కానీ కొందరు రాజకీయ నాయకులకు అదొక భూతల స్వర్గం. రాజకీయాల్లో సంపాదించిన అవినీతి సొమ్ముతో స్థిరాస్తులు కొనుగోలు చేస్తూ సాఫీగా అద్దె ఆదాయాన్ని సృష్టించుకొనే సులువైన మార్గం. ఏ హైదరాబాద్‌లోనో.. విజయవాడలోనో.. కూర్చుని ఒప్పందం కుదుర్చుకుని దుబాయిలో స్థిరాస్తి కొనుగోలు చేస్తే చాలు! పెట్టిన పెట్టుబడిపై సంవత్సరానికి 10-15 శాతం అద్దె రూపంలో వస్తుంటుంది. అసలు ఆ సంపాదన ఆదాయపన్ను శాఖ దృష్టిలోకే రాదు కాబట్టి.. దాన్ని రిటర్నుల్లో చూపించనక్కర్లేదు! అలా చూపించరు కాబట్టి దానిపై పన్ను కట్టాల్సిన పనీ ఉండదు!! పైగా దుబాయి, ఇతర అరబ్ ఎమిరేట్లు.. అన్నీ మనదేశానికి కేవలం 3-4 గంటల విమాన ప్రయాణ దూరంలోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాకపోకలు సాగించవచ్చు!! అన్ని వ్యవహారాలూ చక్కబెట్టుకురావొచ్చు. ఇన్ని వెసులుబాట్లు ఉన్నాయి కాబట్టే.. అవినీతిపరులైన కొందరు భారతీయ రాజకీయ నాయకులు, అత్యంత సంపన్నులు ఇటీవలికాలంలో దుబాయి, ఇతర ఎమిరేట్లలో స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. పుట్టినరోజు వేడుకలు, ఇతర శుభకార్యాలు జరుపుకోవడానికి ఆయా నగరాలకు క్యూ కడుతున్నారు. దుబాయిలో కొత్తగా కడుతున్న ఏ అపార్ట్‌మెంటులోనైనా ఫ్లాట్లు కొంటున్నవారిలో సగానికి పైగా భారతీయులే ఉండడం ఇందుకు నిదర్శనం. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. కొనుగోలుదారులలో ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఉండడం గమనార్హం.
చట్టం ఏం చెప్తోంది?
మన చట్టాల ప్రకారం.. భారతీయులు ప్రపంచంలో ఎక్కడయినా స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే ఆయా లావాదేవీలను విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం 2022కు (ఫెమా-విదేశీ పెట్టుబడులు) అనుగుణంగా మాత్రమే నిర్వహించాలి. ఆ చట్టం ప్రకారం.. విదేశాలలో పెట్టుబడులు పెట్టడానికి, స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి రిజర్వు బ్యాంకు అనుమతి అవసరం. వార్షిక ఆదాయపు పన్ను నివేదికలో (ఐ.టి.ఆర్)లో విదేశీ ఆస్తులు, ఆదాయం గురించి వెల్లడించడం తప్పనిసరి. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద.. భారతదేశం నుండి గరిష్ఠంగా ఒక వ్యక్తి సంవత్సరానికి రెండున్నర లక్షల డాలర్లు అంటే.. దాదాపుగా రూ.2.1 కోట్లు మాత్రమే విదేశాలకు బదిలీ చేయడానికి అనుమతి ఉంటుంది. అది కూడా.. అధీకృత బ్యాంకుల ద్వారా, అన్ని పత్రాలూ సమర్పించి మాత్రమే ఆ లావాదేవీలను నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని ఉల్లంఘించి ఎవరైనా విదేశాలలో ఆస్తి కొనుగోలు చేస్తే.. మొత్తం ఆస్తి విలువకు మూడు రెట్ల దాకా జరిమానా విధిస్తారు. కానీ, చాలా మంది ఆ నిబంధనలను తెలివిగా ఉల్లంఘించి క్రిప్టో నగదుతో రూ.కోట్ల విలువైన ఆస్తులను దుబాయిలో కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు మొత్తం డబ్బును హైదరాబాద్‌లో నగదు రూపంలో చెల్లించేసి.. ఏలాంటి అధికారిక చెల్లింపులూ చేయకుండా దుబాయిలో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా.. బ్యాంకింగ్, నగదుమార్పిడి చార్జీల నుంచి, భారత ప్రభుత్వం విధిస్తున్న క్రిప్టో లావాదేవీల పన్ను నుంచి తప్పించుకుంటున్నారు.
ఒప్పందాల్లో లేకున్నా..
యూఏఈ-భారత ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం.. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల వివరాలు మాత్రమే ఇరు దేశాలూ ఇచ్చిపుచ్చుకొంటాయి. స్థిరాస్తుల కొనుగోళ్ల వివరాలు ఇవ్వాలన్న నిబంధన అందులో లేదు. అంటే.. ఒక భారతీయుడు దుబాయిలో ఏదైనా బ్యాంక్ ఖాతా తెరిచినా, లేక స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టినా ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం యూఏఈ ఆ వివరాలను మాత్రమే భారత అధికారులకు అందజేస్తుంది. మనవాళ్లు అక్కడ కొనుగోలు చేసే ఆస్తుల వివరాలు ఇవ్వదు. ఈ క్రమంలోనే.. చాలామంది భారతీయులు దుబాయి, ఇతర ఎమిరేట్లలో స్థిరాస్తులు కొంటూ స్వదేశంలో ఆదాయపు పన్ను అధికారుల కళ్లు కప్పుతున్నారని గుర్తించిన ఆదాయపన్ను శాఖ రహస్యంగా వారి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. వారిలో రాజకీయ నాయకులు.. అందునా తెలుగువారు కూడా ఉన్నట్టు తేలడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.