ED Intensifies: ఈడీ పెంచిన వేడి
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:00 AM
జగన్‌కు దగ్గరగా ఉండే నలుగురికి లిక్కర్ కేసులో బెయిలు వచ్చేసింది. సిట్ దాఖలు చేసిన మూడో చార్జిషీట్‌లో జగన్ ప్రస్తావనే లేదు. ఇంకేముంది, లిక్కర్ కేసు తేలిపోయినట్లే... అని భావించిన వాళ్లకు...
సుదీర్ఘ కసరత్తు.. ఆ తర్వాతే సోదాలు.. మనీ లాండరింగ్, ఫేక్
ఇన్వాయి్‌సలపై ఆధారాలు.. వైసీపీ శిబిరంలో కలవరం మొదలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘‘జగన్‌కు దగ్గరగా ఉండే నలుగురికి లిక్కర్ కేసులో బెయిలు వచ్చేసింది. సిట్ దాఖలు చేసిన మూడో చార్జిషీట్‌లో జగన్ ప్రస్తావనే లేదు. ఇంకేముంది, లిక్కర్ కేసు తేలిపోయినట్లే’’... అని భావించిన వాళ్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన సోదాలతో షాక్ ఇచ్చినట్లయింది. కేసు పూర్వాపరాలు, ముడుపుల వసూళ్లు, డొల్ల కంపెనీల సృష్టి, హవాలా తరలింపుపై నాలుగు నెలలపాటు సుదీర్ఘ కసరత్తు చేసిన అనంతరమే ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఏకకాలంలో దేశవ్యాప్తంగా 20చోట్ల సోదాలు జరిపారు. ఈ విషయంలో పకడ్బందీగా వ్యవహరించారు. వివిధ వర్గాల ద్వారా లిక్కర్ స్కామ్‌పై కేంద్రానికి అందిన ఫిర్యాదులు, ‘సిట్’ తమ దర్యాప్తులో కనుగొన్న అంశాలను ఈడీ అధ్యయనం చేసింది. దీనిపై ‘సిట్’ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబుతో సమావేశమై సమాచారాన్ని సేకరించింది. ఆ తర్వాతే గురువారం విస్తృతంగా సోదాలు జరిపింది.
కీలక ఆధారాలు లభ్యం..
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్లకు బలం చేకూర్చే కీలక ఆధారాలను ఈడీ సేకరించినట్లు తెలిసింది. పదుల కిలోల బంగారం ఇన్వాయి్‌సల నుంచి పండ్ల ఎగుమతులు, ప్యాకేజింగ్ పేరుతో జరిగిన లావాదేవీల అసలు గుట్టు వెలికి తీసింది. ఫేక్ ఇన్‌వాయిస్‌లు, జీఎస్టీ గోల్‌మాల్‌పై నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. డిస్టిల్లరీ యజమానులు ఎవరెవరు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎంతెంత ముడుపులు చెల్లించారో ఆధారాలు సేకరించి.. ఆ మొత్తాన్ని ఏయే దేశాలకు హవాలా మార్గంలో తరలించారో కూడా తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో జగన్ శిబిరంలో కలకలం మొదలైనట్లు తెలుస్తోంది. గురువారం రాత్రే సీనియర్ న్యాయవాదులతో జగన్ సమావేశమై చర్చించినట్లు సమాచారం. ఇప్పటిదాకా... ‘సిట్’ దర్యాప్తు, అరెస్టులను వైసీపీ నేతలు ‘రాజకీయ కక్ష సాధింపు’గా అభివర్ణిస్తూ వచ్చారు. అసలు స్కామే లేదని బుకాయిస్తున్నారు. ఈడీ రంగ ప్రవేశంతో వారిలో కలవరం మొదలైంది.
రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఏదైనా కేసులో చేసిన అభియోగాలను ఆధారాలతో సహా తామే నిరూపించాల్సి ఉంటుంది. ఈడీ కేసుల్లో అలా కాదు! ‘ఆ అభియోగాల్లో నిజం లేదు’ అని నిందితులే నిరూపించుకోవాలి. ఈ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డి వందల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారు. ఆ డబ్బు మద్యం ముడుపుల నుంచి సేకరించిందేనని కోర్టుకు ఈడీ చెబితే... అది ఎవరి సొమ్ము అనే స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత నిందితుడిదే. ఈ కేసులో విజయ సాయిరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, అప్పటి ఎక్సైజ్ ఉన్నతాధికారి రజత్ భార్గవ, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ రెడ్డి తదితరుల వాంగ్మూలాలు కీలకం కానున్నాయి.