Kharif Crop Registration: ఈ-పంట.. వీఏఏలకు తంటా
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:39 AM
గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకు(వీఏఏ-వీహెచ్‌ఏ)లకు ఈ-పంట నమోదు సంకటం మారింది. జియో ఫెన్సింగ్ ద్వారా 20మీటర్ల దూరం నుంచి పొలాల్లోని పంటను ఫొటో తీసి, ఈ-పంట యాప్‌లో...
ఓ వైపు ఎరువుల పంపిణీ, మరోవైపు ఇతర విధులు
ఫొటో క్యాప్చర్ దూరం తగ్గించాలని విజ్ఞప్తి
అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకు(వీఏఏ-వీహెచ్‌ఏ)లకు ఈ-పంట నమోదు సంకటం మారింది. జియో ఫెన్సింగ్ ద్వారా 20మీటర్ల దూరం నుంచి పొలాల్లోని పంటను ఫొటో తీసి, ఈ-పంట యాప్‌లో రైతుల వివరాలు నమోదు చేయమనడంతో నానా తంటాలు పడుతున్నారు. మెట్ట ప్రాంతాల్లో కాలువ చివరి భూములు, ఎత్తైన మెరక భూములు, వరి మాగాణుల్లో ఈ విధానం అమలు చేయడం కష్టమవుతోందని వీఏఏలు గగ్గోలుపెడుతున్నారు. వర్షాలు వరదలతో ఈ-పంట నమోదు నత్తనడక నడుస్తోంది. ఇటీవల వీఏఏలు, వీహెచ్‌ఏలు బదిలీలు కావడంతో కొత్త ప్రాంతాల్లో రైతుల వివరాలు తెలుసుకుని, నానా అవస్థలు పడుతూ క్షేత్ర స్థాయికి వెళ్లి, ఈ-పంట నమోదు చేస్తున్నారు. గతంలో జియోఫెన్సింగ్ విధానం 200మీటర్ల వరకు ఉండగా, కేంద్రం ఫొటో క్యాప్చర్‌ను కుదించింది. పంటకు 20మీటర్ల వరకు వెళ్తేనే పోర్టల్‌లో ఫొటో క్యాప్చర్ అవుతోంది. కనీసం 100మీటర్లయినా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో మహిళా వీఏఏలు, వీహెచ్‌ఏలు ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో ఈ-పంట నమోదు ప్రక్రియను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2.61కోట్ల ల్యాండ్ పార్సిల్స్ ఉండగా, ఇప్పటి వరకు 40శాతం కూడా పూర్తి కాలేదని సమాచారం. మరోవైపు రైతుసేవా కేంద్రాల్లో ఎరువుల అమ్మకాల బాధ్యత కూడా వీఏఏలకు అప్పగించారు. ఎరువులు అమ్మడం, ఆన్‌లైన్‌లో మార్క్‌ఫెడ్ ఖాతాలో సొమ్ము జమ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంది. ఇంకోవైపు వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులకు ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్ చేసి, పరికరాలు అందజేయాల్సి ఉంది.
ఏకకాలంలో ఇన్ని పనులు అప్పగించడంతో వీఏఏలు, వీహెచ్‌ఏలు భారంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో 5,712మంది వీఏఏలు, 2,356మంది వీహెచ్‌ఏలు ఉన్నారు. వీరితో పాటు ఎంపీఈవోలు 1,369మంది, ఏఈవోలు 410మంది పని చేస్తున్నారు. ఒకరికొకరు సహకరించుకున్నా.. లక్ష్య సాధన కష్టతరంగా మారుతోందని వాపోతున్నారు. పని ఒత్తిళ్ల కారణంగా పలువురు అనారోగ్యం పాలుకావడం, ఒకరిద్దరు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఎరువుల పంపిణీని సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తే.. ఈ-పంట నమోదుతో పాటు రైతులకు సాంకేతిక సహకారాన్ని అందించడం సులవుగా ఉంటుందని వీఏఏలు, వీహెచ్‌ఏలు అంటున్నారు.