Share News

CM Chandrababu Naidu: సిద్ధాంతాలు తిండిపెట్టవు

ABN , Publish Date - Dec 18 , 2025 | 05:43 AM

దేశంలో ఆర్ధిక సంస్కరణలు వచ్చాకే మనుషుల ఆలోచనా విధానం మారిందని సీఎం చంద్రబాబు అన్నారు.

 CM Chandrababu Naidu: సిద్ధాంతాలు తిండిపెట్టవు

డేటా కరెక్టేనా ..

నీటి సంరక్షణ, నిల్వపై సమీక్షించే క్రమంలో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లోని భూగర్భ జలాల నిల్వలపై ఆర్టీజీఎస్‌ డేటాను సీఎం పరిశీలించారు. ‘డేటా కరెక్టేనా’ అని అక్కడే ఉన్న ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ను ప్రశ్నించారు. ‘కరెక్టు కాకపోతే నా పరువు పోతుంది.. జాగ్రత్త’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే, ఆ డేటా సరైనదేనని జిల్లాల కలెక్టర్లు కూడా ధ్రువీకరించారు. అయినా, మరోసారి చెక్‌ చేసుకోవాలని భాస్కర్‌కు సీఎం సూచించారు.

సంస్కరణ లు, ఐటీతోనే మార్పులు : చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): దేశంలో ఆర్ధిక సంస్కరణలు వచ్చాకే మనుషుల ఆలోచనా విధానం మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. సంస్కరణ లు రాకముందు ప్రతి ఒక్కరూ సిద్ధాంతాలు మాట్లాడారని, అవి మనుషులకు తిండిపెట్టవని వ్యాఖ్యానించారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన విలువలు, సిద్ధాంతాల గురించి మాట్లాడారు. సిద్ధాంతాలు, విలువలు వేర్వేరని, ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందాలంటే రోడ్లు, విద్యుత్‌, విద్యా సౌకర్యాలు బాగుండాలన్నా రు. 1995 నాటికి టెక్నాలజీ రాగానే తొలిగా అందిపుచ్చుకొని పనిచేశామన్నారు. ‘‘దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా, 1991 వరకు ప్రపంచం మన దేశాన్ని గుర్తించలేదు. ఎక్కడికిపోయినా తక్కువగా చూసేవారు. ఆర్ధిక సంస్కరణలతోనే ప్రపంచం మన దేశాన్ని చూసే విధానం మారింది. ప్రధాని మోదీ ఇప్పుడు స్థిరమైన ప్రభుత్వం ఇచ్చారు. దీంతో ప్రపంచమంతా గర్వించేలా ముందుకు వెళ్తున్నాం. కేవలం ఈ 25 ఏళ్లలోనే ఇవన్నీ సాధ్యమయి ఫాస్ట్‌ట్రాక్‌లోకి వచ్చాం. గతంలో ప్రభుత్వ రంగంలో విద్యుత్‌ ప్రాజెక్టులు ఉన్నా పవర్‌ ఉండేది కాదు. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం తెలుగు వారికి వచ్చిందంటే నాలెడ్జ్‌ ఎకానమీలో ముందు ఉండటమే కారణం. 30 ఏళ్ల క్రితం ప్రైవేటు రంగంలో ప్రారంభించిన ఇంజనీరింగ్‌ కాలేజీలే దీనికి కారణం’’ అని సీఎం వివరించారు.

Updated Date - Dec 18 , 2025 | 05:44 AM