CM Chandrababu: తీరానీకి హరం
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:02 AM
తూర్పు తీరం మారీటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా మారుతుంది. దీనికి ఏపీనే కేంద్రంగా ఉంటుంది. పొరుగు రాష్ట్రాల కార్గోను కూడా రాష్ట్రంలోని పోర్టుల ద్వారానే రవాణా చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
లాజిస్టిక్స్ గేట్‌వేగా తూర్పు తీరం
మన రాష్ట్రమే దానికి కేంద్రం
ప్రతి 50 కి.మీ.లకు ఒక పోర్టు
రైల్, ఎయిర్, రోడ్డుతో అనుసంధానం
లాజిస్టిక్స్ కోసం ప్రత్యేక కార్పొరేషన్
త్వరలో రెండు కొత్త యూనివర్సిటీలు
అదానీ లాజిస్టిక్స్ యూనివర్సిటీ,జీఎంఆర్ సివిల్ ఏవియేషన్ వర్సిటీ రాక
ప్రస్తుతం 6 పోర్టులు, నిర్మాణంలో మరో 4
షిప్ బిల్డింగ్ తయారీలోనూ ముందుకు
అమరావతికి త్వరలోనే బుల్లెట్ ట్రైన్
ఈస్ట్ కోస్ట్ మారీటైమ్ అండ్ లాజిస్టిక్స్ సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి
రాష్ట్రంలో 1,050 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉంది. సముద్ర రవాణాలో ఏపీ రెండోస్థానంలో ఉంది. ఈ విషయంలో మనం మరింత అభివృద్ధి సాధించాలి. మనకు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నందున ఇది సాధ్యమే.
- చంద్రబాబు
విశాఖపట్నం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘‘తూర్పు తీరం మారీటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా మారుతుంది. దీనికి ఏపీనే కేంద్రంగా ఉంటుంది. పొరుగు రాష్ట్రాల కార్గోను కూడా రాష్ట్రంలోని పోర్టుల ద్వారానే రవాణా చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టును ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ప్రతి పోర్టునూ రైలు, ఎయిర్, రోడ్డు మార్గాలతో అనుసంధానిస్తూ మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నట్టు తెలిపారు. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో మంగళవారం జీఎఫ్ఎస్‌టీ, మారీటైమ్ గేట్‌వే సంయుక్తంగా నిర్వహించిన ‘ఈస్ట్ కోస్ట్ మారీటైమ్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్’కు ఆయన హాజరయ్యారు. లాజిస్టిక్స్ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి, పాలసీని రూపొందిస్తామన్నారు. దీనికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి 15 నుంచి 20 మందితో ఒక కమిటీని ఏర్పాటుచేయాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు.
అమరావతికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా అదానీ గ్రూపు లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తుందని, అలాగే విశాఖపట్నంలో జీఎంఆర్ సంస్థ సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందన్నారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్‌తోపాటు రిపేర్లు, బ్రేకింగ్ యూనిట్లు, కంటెయినర్ల నిర్మాణానికి ఎవరైనా ముందుకు వస్తే తగిన సహకారం అందిస్తామన్నారు.ఏపీలో పోర్టుల నుంచి కార్గో 90 శాతం బల్క్‌గానే రవాణా జరుగుతోందని, కంటెయినర్ కార్గో కూడా పెంచాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 1,050 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, సముద్ర రవాణాలో ఏపీది రెండో స్థానమని, మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నందున మరింత అభివృద్ధి సాధించవచ్చునన్నారు. లాజిస్టిక్స్ కోసం దీర్ఘకాలిక విధానం తీసుకువస్తామని, వాటికి భూమిని దీర్ఘకాలిక లీజుకు ఇస్తామని వివరించారు. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల నుంచి ఎయిర్‌కార్గో పెంచాలని సూచించారు. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులకు ప్రాధాన్యం ఇచ్చి, వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇస్తామన్నారు. రాష్ట్ట్రంలో ప్రైవేటు పోర్టుల ద్వారా ఏడాదికి 69 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్, 11 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా జరుగుతోందన్నారు. భారీ నౌకలు వచ్చేందుకు అవసరమైనంత లోతు 18 మీటర్ల డ్రాఫ్ట్ ఏపీలోనే ఉందన్నారు. నదుల అనుసంధానం ద్వారా కూడా జల రవాణా పెంచుకోవచ్చునన్నారు. ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు పోర్టులు ఉండగా, మరో 4 నిర్మాణంలో ఉన్నాయన్నారు. మూలపేట, మచిలీపట్నం, కాకినాడ, రామాయపట్నం.. పోర్టుల వద్ద అనుబంధ పరిశ్రమలు, పోర్టు టౌన్‌షిప్‌ల కోసం పది వేల ఎకరాలు అందుబాటులో ఉందన్నారు.
డ్రోన్లతో సరుకు రవాణాకు సహకారం
సదస్సుకు ముందు ఆయన వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో 14 మంది పలు సూచనలు చేశారు. అందులో ఒకరు డ్రోన్ల ద్వారా సరుకులను రవాణా చేస్తున్న తమకు సహకారం అందించాలని కోరారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మందులను డ్రోన్ల ద్వారా పంపిస్తుంటే కిలో రూ.80 వరకు పడుతోందని సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. తప్పక ప్రోత్సహిస్తామన్నారు. శ్రావణ్ షిప్పిం గ్ ఎండీ సాంబశివరావు మాట్లాడుతూ.. విమానాల ద్వారా సరుకు పంపడానికి ఏర్పాట్లు చేయాలని, పోర్టులకు కూడా ఇండస్ట్రియల్ ఏరియాల లోకల్ అథారిటీ(ఐలా) పెట్టాలని కోరగా, సీఎం అంగీకరించారు. అనంతరం ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్‌ను ప్రారంభించారు.