Farmers Loans: రైతులకు మరింత సులభంగా రుణాలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 05:01 AM
రైతులకు ముఖ్యంగా కౌలు రైతులకు రుణాల మంజూరు మరింత సరళతరం కావాలని లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ సమావేశంలో పలువురు ఎంపీలు అభిప్రాయపడ్డారు.
బ్యాంకర్లను కోరిన ఎంపీలు... బెజవాడలో లోక్‌సభ సబార్డినేట్ కమిటీ సమావేశాలు
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): రైతులకు ముఖ్యంగా కౌలు రైతులకు రుణాల మంజూరు మరింత సరళతరం కావాలని లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ సమావేశంలో పలువురు ఎంపీలు అభిప్రాయపడ్డారు. విజయవాడలో లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ సమావేశాలు కమిటీ చైర్మన్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన మంగళవారం ప్రారంభమయ్యాయి. బుధవారం కూడా కొనసాగుతాయి. రైతులకు సులభ రుణాలు అనే అంశంతోపాటు పెరిగిపోతున్న సైబర్ నేరాలు, క్లైయిం చేయని బ్యాంకు డిపాజిట్లు, చిన్నతరహా పరిశ్రమలకు రుణాల మంజూరు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, మహిళలకు స్వయం ఉపాధిపైన చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా బ్యాంకు సేవలను అందించాలని, సామాజిక బాధ్యతల్లో బ్యాంకులు ముందుండాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సూచించారు. కమిటీ సభ్యులు ప్రేమచంద్రన్, రఘునందన్‌రావు, మెయినా మల్హోత్రా, రాజీవ్ రాయ్, వివేక్ ఠాకూర్, రాజేశ్ వర్మ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పర్మిందర్ చోప్రా, ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు, కెనరా బ్యాంక్ సీఎండీ కె.సత్యనారాయణరాజు, యూనియన్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామసుబ్రమణ్యం, వివిధ బ్యాంకుల చైర్మన్లు, ఎండీలు, సీఈవోలు హాజరయ్యారు.