Minister Lokesh: విద్యార్థి దశలోనే విదేశీ భాషలపై శిక్షణ
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:26 AM
ఇకపై చదువు పూర్తయ్యాక కాకుండా చదువులో భాగంగానే జర్మన్, జపనీస్ లాంటి విదేశీ భాషలపై శిక్షణ ఇస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్...
సీడాప్ ద్వారా 50 వేల ఉద్యోగాలు
రాష్ట్రంలో విదేశీ భాషల పరీక్ష కేంద్రాలు: లోకేశ్
జర్మనీలో ఉద్యోగాలు పొందిన వారికి అభినందన
అమరావతి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఇకపై చదువు పూర్తయ్యాక కాకుండా చదువులో భాగంగానే జర్మన్, జపనీస్ లాంటి విదేశీ భాషలపై శిక్షణ ఇస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవల్‌పమెంట్ ఇన్ ఏపీ(సీడాప్) ద్వారా రాబోయే ఐదేళ్లలో 50 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం లక్ష్యం అని చెప్పారు. సీడాప్, ఇండో యూరో సింక్రనైజేషన్ అండ్ జర్మన్ హెల్త్‌కేర్ సహకారంతో జర్మనీలో హెల్త్‌కేర్ విభాగంలో ఉద్యోగాలు సాధించిన 14 మంది రాష్ట్ర యువతీయువకులు శనివారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రిని కలిశారు. ఉద్యోగాలు సాధించిన వారిని లోకేశ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్మనీలో ఉద్యోగాల కోసం మొదటి బ్యాచ్‌లో 171 మందికి శిక్షణ ఇవ్వగా, వివిధ విభాగాల్లో 40 మంది ఎంపికయ్యారని, 14 మంది త్వరలోనే జర్మనీ వెళ్లబోతున్నారని వివరించారు. మిగిలిన అభ్యర్థులు కూడా వివిధ దశల్లో శిక్షణ పూర్తిచేసుకుంటున్నారని, వారికి త్వరలోనే ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రాష్ట్ర యువత అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు సాధించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని, అందుకు అనుగుణంగా వారికి శిక్షణ అందుతోందన్నారు. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను మన విద్యార్థులు అందిపుచ్చుకునేలా సీడాప్, ఓంక్యాప్ సంస్థల ద్వారా విదేశీ భాషలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈనెలలోనే నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభిస్తామని లోకేశ్ తెలిపారు.