Share News

Duvvada Srinivas: నన్ను చంపేస్తారా దమ్ముంటే రండి

ABN , Publish Date - Dec 28 , 2025 | 05:20 AM

వైసీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపారు. నడిరోడ్డుపై కారు ఆపి మరీ వైసీపీలోనే తన ప్రత్యర్థులకు బహిరంగ సవాల్‌ విసిరారు.

Duvvada Srinivas: నన్ను చంపేస్తారా దమ్ముంటే రండి

  • నిమ్మాడ జంక్షన్‌లో దువ్వాడ హల్‌చల్‌

  • కృష్ణదాస్‌ వర్గానికి బహిరంగ సవాల్‌

శ్రీకాకుళం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): వైసీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపారు. నడిరోడ్డుపై కారు ఆపి మరీ వైసీపీలోనే తన ప్రత్యర్థులకు బహిరంగ సవాల్‌ విసిరారు. తనకు ప్రాణహాని ఉందని, తనను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని ఆరోపిస్తూ నిమ్మాడ జంక్షన్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం వస్తున్న క్రమంలో దువ్వాడ శ్రీనివాస్‌ నిమ్మాడ హైవే జంక్షన్‌ వద్ద తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేత, మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వర్గం నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘నేను హైదరాబాద్‌ నుంచి వస్తున్నానని తెలిసి కింజరాపు అప్పన్న అనే వ్యక్తి ద్వారా కృష్ణదాస్‌ నాకు కబురు పంపారు. దమ్ముంటే రమ్మని, వస్తే చంపేస్తాం, నరికేస్తాం, అటాక్‌ చేస్తాం అని బెదిరించారు’ అని దువ్వాడ పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి వారి అవినీతిని, చిల్లర రాజకీయాలను బయటపెట్టినందుకే తనను అంతం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘మీరు చేస్తున్న కేడీ రాజకీయాలను ఎండగట్టినందుకు నన్ను చంపేస్తారా? చంపేస్తామని బెదిరిస్తే అదిరిపోతాడు, బెదిరిపోతానని అనుకుంటున్నారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కింజరాపు అప్పన్న తనకు ఫోన్‌ చేసి వెనక్కి వెళ్లిపోమని చెప్పారని.. కానీ తాను భయపడే రకం కాదని స్పష్టం చేశారు. ‘ఇప్పుడు రాత్రి 9.30 అవుతోంది. రాత్రి 11.30 గంటలయినా ఇక్కడే ఉంటా. దమ్ముంటే రండి.. చంపాలంటే చంపండి’ అంటూ దువ్వాడ సవాల్‌ విసిరారు. వైసీపీ తనను సస్పెండ్‌ చేసినా, బహిష్కరించినా తాను స్వతంత్రంగానే ప్రజా సమస్యలపై పోరాడతానన్నారు. కాగా, ధర్మాన కృష్ణదాస్‌, ధర్మాన ప్రసాదరావుల వల్ల తనకు ప్రాణహాని ఉందని దువ్వాడ శ్రీనివాస్‌ వెల్లడించారు. శనివారం రాత్రి ఎస్పీ మహేశ్వరరెడ్డిని కలిసి ఫిర్యాదును అందించారు. విచారణ చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు.

Updated Date - Dec 28 , 2025 | 05:22 AM