ఇష్టారాజ్యంగా విధులు...!
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:12 AM
జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు.
నంద్యాలలో 516 సచివాలయాలు
జిల్లా వ్యాప్తంగా 4353మంది ఉద్యోగులు
డిప్యూటేషనలో 523 మంది విధులు
పర్యావేక్షణ గాలికి.. పాలన అస్తవ్యస్తం
మధ్యాహ్నానికి ఇంటికి వెళ్లిపోతున్న ఉద్యోగులు
ఆ మూడు క్యాడర్ల పని అంతంతే..
నంద్యాల, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలలోనే కాదు.. మండల ప్రాంతాల్లో ఇదే దుస్థితి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉద్యోగులు అలా వచ్చి మధ్యాహ్నానికి ఇంటి ముఖం పడుతున్నారు. జిల్లాలో మెజార్టీ వార్డు, గ్రామ సచివాలయాల పరిస్థితి ఇదే. జిల్లా, తాలుకా, మండల కేంద్రాలకు దగ్గర్లో ఉన్న, రోడ్డు మార్గం, బస్సు సౌకర్యం అనుకూలంగా ఉన్న గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల హాజరు పర్లేదు అనిపించినా, మారుమూల గ్రామ సచివాయాల్లో సమయపాలన అస్తవ్యస్తంగా ఉంది. పట్టణ, నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వెల్ఫేర్, డిజిటల్ అసిస్టెంట్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, మిగిలిన సిబ్బందికి ఆ స్థాయిలో పనులు ఉండడం లేదని అంటున్నారు. వార్డు, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే దారుణ వాస్తవాలు వెలుగు చూశాయి.
జిల్లా వ్యాప్తంగా 516 గ్రామ వార్డు సచివాలయాలు ఉండగా.. ఇందులో 4,353 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టాలనే ఆశయంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పలు మార్పులు చేసింది. నివాస గృహాలు, కుటుంబాలను మ్యాపింగ్ చేశారు. రెండు సచివాలయాను కలిపి ఒక క్లస్టర్‌గా మార్చారు. అదే క్రమంలో ఒక్కొ సచివాలయంలో 10-11 మంది సిబ్బంది ఉన్నా, వారికి సరైన జాబ్ చార్ట్ లేకపోవడంతో ఎవరు ఏ పని చేయాలో తెలియని పరిస్థితి ఉండేది. అదనపు సిబ్బంది భారం తగ్గించుకోవడానికి రీ-గ్రూపింగ్ విధానం తీసుకొచ్చారు. 2,500 జనాభాలోపు ఉంటే కేటగిరి-ఏ, 2,501-3,500 వరకు జనాభా ఉంటే కేటగిరి-బి, 3,501 ఆపైన జనాభా ఉంటే కేటగిరి-సీగా గ్రామ, వార్డు సచివాలయాను విభజించారు. కేటగిరి-ఏ సచివాలయంలో ఆరుగురు, కేటగిరి-బీ సచివాలయంలో ఏడుగురు, కేటగిరి-సి సచివాలయంలో 8-10 మంది ఉద్యోగులు పని చేసేలా విధివిధానాలు తీసుకొచ్చారు.
ఫ కొందరికే పని భారం:
గ్రామ సచివాలయాల్లో వీఆర్‌వో, వెల్ఫేర్ సెక్రెటరీ, డిజిటల్ అసిస్టెంట్, ఆరోగ్య కార్యకర్త, సర్వేయర్, గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు, పశు సంవర్ధక సహాయకులు, మహిళా పోలీస్, ఎనర్జీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉంటారు. ఎనర్జీ, ఇంజనీరింగ్ రెండు విభాగాల్లో రెండు సచివాలయాలు కలిపి ఒకరు పని చేయాలి. వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, వీఆర్‌వోలకు పని భారం ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. నగర, పట్టణలోని వార్డు సచివాలయాల్లో అడ్మిన సెక్రెటరీ, వెల్ఫేర్, ఎడ్యూకేషన, రెవిన్యూ సెక్రెటరీలు, ఏఎనఎం, ప్లానింగ్, అమినిటీస్ సెక్రెటరీ, శానిటేషన సెక్రెటరీ, వార్డు ఎనర్జీ సెక్రెటరీ, మహిళా పోలీస్‌లు ఉంటారు. అడ్మిన, ఎడ్యూకేషన, ప్లానింగ్, శానిటేషన సెక్రెటరీలకు పని భారం ఉంటుంది. మిలిగిన ఉద్యోగులకు ఆ స్థాయిలో పని భారం ఉండడం లేదని తెలుస్తుంది. ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి 5 వరకు పింఛన్ల పంపిణీలో మాత్రం సచివాలయ సిబ్బంది అందరూ బిజీగా ఉంటారని తెలుస్తుంది. ప్రస్తుతం కౌశల, ఈకేవైసీ, ఐదేళ్లు దాటిన పిల్లల బయోమెట్రిక్, జియో క్వార్డినేట్ (ఇల్లు మారిన వారి వివరాలు సేకరణ) పనులున్నా కొందరిపైనే పని భారం అధికంగా ఉంటుందని తెలుస్తుంది.
ఫ సమయపాలన అస్తవ్యస్తం:
సచివాలయల ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఆంధ్రజ్యోతి విజిట్‌లో స్పష్టంగా తెలుస్తుంది. ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల్లోగా విధులకు హాజరై థంబ్ వేయాల్సి ఉంది. అయితే.. చాలా సచివాలయాల్లో మెజార్టీ సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావడం లేదు. కొందరైతే ఎప్పుడొస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి ఉంది. థంబ్ (హాజరు) వేసి ఫీల్డ్ విజిట్ పేరిట బయటకు వెళ్లిపోతున్నారు. ఏ పనిపైన వెళ్తున్నారో మూమెంట్ రిజిసా్ట్రర్‌లో రాయడం లేదు. పర్యవేక్షణ అధికారులు సైతం గాంధారిపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈనెల పదో తేదీ సోమవారం నాడు ఆంధ్రజ్యోతి పలు సచివాలయాలను విజిట్ చేసింది. అందులో భాగంగా నంద్యాల పట్టణంలోని సరస్వతి నగర్‌లోని 15వ సచివాలయంలో ఈనెల పదో తేదీ సోమవారం ఆంధ్రజ్యోతి విజిట్ చేసింది. ఇక్కడ 8 మంది ఉద్యోగులు ఉండగా 10:30 గంటలైనా కేవలం ముగ్గురు ఉద్యోగులు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఐదుగురు విధులకు గైర్హాజరయ్యారు.
ఫ రుద్రవరంలోని రెండో సచివాలయంలో సిబ్బంది ఏడుగురికి గాను ముగ్గురే హాజరయ్యారు. ఆ ముగ్గురులో పంచాయతీ కార్యదర్శి సునీల్‌కుమార్‌రెడ్డి, వెల్ఫేర్ అసిస్టెంట్ రాజ్‌కుమార్, డిజిటల్ అసిస్టెంట్ చందనప్రియలు ఉన్నారు. సమయపాలన పాటించడంలో సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారనడానికి ఈ కేంద్రమే నిదర్శనం.
ఫ చాగలమర్రి మండలంలోని శెట్టివీడులో వీహెచఏ ఆగస్టు 18 నుంచి ఎలాంటి సెలవు పెట్టకుండా వెళ్లిపోయారు. ఇంత వరకు ఆ పోస్టు గురించి సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. గొడిగనూరు, శెట్టివీడు గ్రామాల్లో పంట నష్టం, ఈ-క్రాప్ నమోదు సక్రమంగా చేయలేదని, అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
ఫ ప్యాపిలి పట్టణంలోని 2వ సచివాలయంలో 6 నెలలుగా పంచాయితీ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ పనిచేస్తున్న కార్యదర్శి జూనలో బదిలీపై వెళ్లారు. దీంతో సచివాలయంలో ఏ ఒక్కరూ సమయ పాలన పాటించడం లేదు. సచివాలయంలో 9 మంది సిబ్బంది ఉండగా సోమవారం ఆంద్రజ్యోతి విజిట్‌లో కేవలం ఐదుగురు మాత్రమే విధులకు హాజరయ్యారు. మిగతా వారు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లినట్లు చెబుతున్నారు.
ఫ నందికొట్కూరు పట్టణంలో 14 వార్డు సచివాయాలు ఉన్నాయి. ఇందులో 121 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీ సైక్లింగ్ విధానం వల్ల పెద్దగా మార్పులు ఏమి కనిపించడం లేదు. గత ప్రభుత్వంలో నామమాత్రపు విధులు నిర్వహించే వారు.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. కాకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయ ఉద్యోగులు నిర్వహిస్తున్నారు.