Share News

రైల్వేలో దసరా జోష్‌!

ABN , Publish Date - Oct 06 , 2025 | 01:18 AM

కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ రైల్వే డివిజన్‌ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. శనివారం ఒక్క రోజే 2.80 లక్షల మంది ప్రయాణం చేయడం ద్వారా రూ. 5 కోట్ల ఆదాయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే ఏ డివిజన్‌ కూడా ఒక్క రోజులో ఇంత ఆదాయాన్ని సాధించలేదు. తొలిసారిగా ఈ రికార్డును విజయవాడ రైల్వే డివిజన్‌ దక్కించుకుంది.

రైల్వేలో దసరా జోష్‌!

- ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించిన విజయవాడ డివిజన్‌

- శనివారం 2.80 లక్షల మంది ప్రయాణం.. రూ.5 కోట్ల ఆదాయం

- స్థానికంగా ప్రయాణాలను లెక్కిస్తే 5.5 లక్షల మంది ప్రయాణాలు

- ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి భారీగా తరలిరాక

- డివిజన్‌ ఆదాయంలో సింహబాగం విజయవాడ రైల్వేస్టేషన్‌దే !

- ఒక ్కరోజే 82 వేల మంది ప్రయాణీకులు ..రూ. 2 కోట్ల ఆదాయం

కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ రైల్వే డివిజన్‌ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. శనివారం ఒక్క రోజే 2.80 లక్షల మంది ప్రయాణం చేయడం ద్వారా రూ. 5 కోట్ల ఆదాయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే ఏ డివిజన్‌ కూడా ఒక్క రోజులో ఇంత ఆదాయాన్ని సాధించలేదు. తొలిసారిగా ఈ రికార్డును విజయవాడ రైల్వే డివిజన్‌ దక్కించుకుంది.

విజయవాడ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):

దసరా ఉత్సవాల సందర్భంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునేందుకు రైళ్లలో విజయవాడ తరలివచ్చారు. నవరాత్రుల్లో ప్రతి రోజూ రైళ్లు కిక్కిరిసిపోయి నడిచాయి. దసరా పండగ తర్వాత ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భవానీలు కనకదుర్గమ్మను దర్శించుకోవటానికి వచ్చారు. దీంతో శనివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 2.80 లక్షల మంది బయట ప్రయాణికులు రాకపోకలు సాగించారు. లోకల్‌గా కూడా ప్రయాణాలు చూస్తే మొత్తంగా 5.5 లక్షల మంది ప్రయాణికులు చేశారు. శనివారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను 1.90 లక్షల మంది దర్శనం చేసుకోవటానికి వచ్చారు. ఈ నేపథ్యంలో 82 వేల మంది విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి రాకపోకలు సాగించారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ ఒక్కటే రూ.2 కోట్ల ఆదాయాన్ని సాధించింది. బయటి నుంచి వచ్చిన ప్రయాణికులు కాకుండా లోకల్‌గా కూడా కలిపితే విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి 1.7 లక్షల మంది ప్రయాణాలు చేశారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడకు పోటెత్తుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని విజయవాడ రైల్వే డివిజనల్‌ అధికారులు ప్రయాణికులకు ఎక్కడా సమస్యలు రాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌తో పాటు డివిజన్‌ పరిధిలోని ప్రధాన స్టేషన్లలో కూడా 25 అదనపు బుకింగ్‌, రిజర్వేషన్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా మొత్తం 72 ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్‌ (ఏటీవీఎం)లను ప్రారంభించారు. వీటి ద్వారా భారీగా టికెట్ల విక్రయాలు జరిగాయి. ఏటీవీఎలు 24 గంటల పాటు పనిచేసేలా మొత్తం 110 మంది ఫెసిలిటేటర్లను రైల్వే అధికారులు నియమించారు. ఫలితంగా రికార్డు స్థాయిలో ప్రయాణికులు వచ్చినా కూడా ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బందులనేవి తలెత్తకుండా సాఫీగా నడిచింది. విజయవాడ డివిజన్‌ దక్షిణ మధ్యరైల్వే పరిధిలోనే రికార్డు స్థాయిలో ఆదాయం సాధించటంపై డివిజినల్‌ మేనేజర్‌ (డీఆర్‌ఎం) మోహిత సోనాకియా అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషిని అభినందించారు.

Updated Date - Oct 06 , 2025 | 01:18 AM