Kadapa District: వినాయకునికీ తప్పని రప్పా.. రప్పా
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:17 AM
వైసీపీ రప్పా రప్పా నినాదాలు... గొడ్డలి గుర్తులూ వినాయక విగ్రహాన్నీ వదల్లేదు. ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరగాల్సిన నిమజ్జన శోభాయాత్రలో వైసీపీ శ్రేణుల వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయి.
కడప జిల్లాలో వైసీపీ శ్రేణుల పైశాచికానందం
విగ్రహం వెనుకభాగాన రప్పా.. రప్పా నినాదాలు, గొడ్డలి గుర్తు
ఎర్రగుంట్ల, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): వైసీపీ రప్పా రప్పా నినాదాలు... గొడ్డలి గుర్తులూ వినాయక విగ్రహాన్నీ వదల్లేదు. ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరగాల్సిన నిమజ్జన శోభాయాత్రలో వైసీపీ శ్రేణుల వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయి. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని పెద్దనపాడు గ్రామంలో వినాయకుని నిమజ్జనంలో వింత పోకడలు చోటుచేసుకున్నాయి. గ్రామంలోని వీధుల్లో నిమజ్జనానికి బయలుదేరిన వినాయక విగ్రహం వెనుక వైపున 2.0, రప్పా రప్పా వైఎస్సార్ అక్షరాలతో పాటు ఎర్రటి రంగులో ఉన్న గొడ్డలి గుర్తును వేశారు.
ఇంతటితో ఆగకుండా వినాయక విగ్రహాన్ని పైకి ఎగురవేస్తూ రప్పా, రప్పా వైఎస్సార్ అని కేకలు వేస్తూ నిమజ్జనానికి వీధుల గుండా తీసుకెళ్లడం గ్రామస్థులను విస్మయానికి గురిచేసింది. ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే సంవత్సరం వినాయకచవితికి ఎవరికీ చందాలివ్వకూడదని గ్రామానికి చెందిన కొందరు నిర్ణయించుకున్నారు. కాగా.. పెద్దనపాడు వినాయక విగ్రహ నిమజ్జన విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, శాంతిభద్రతల దృష్ట్యా ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.