దుర్గే దుర్గతినాశని..
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:18 AM
శరన్నవరాత్రి మహోత్సవాల్లో దుర్గాష్టమి రోజైన మంగళవారం శ్రీదుర్గాదేవిగా విజయవాడ శ్రీకనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిదైన దుర్గారూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను కనులవిందుగా వీక్షించి తన్మయత్వం చెందారు. ఆయురారోగ్యాలను ప్రసాదించే దివ్యరూపిణి దుర్గమ్మను శరణువేడుకున్నారు. రాత్రి ఏడు గంటలకు లక్ష మంది వరకు భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు.
- ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
- దుర్గాదేవిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ
- రాత్రి 7 గంటలకు లక్ష దాటిన భక్తుల సంఖ్య
- ఉత్తరాంధ్ర నుంచి పెరిగిన భవానీల రాక
- నేడు మహిషాసురమర్దినిగా దర్శనం
శరన్నవరాత్రి మహోత్సవాల్లో దుర్గాష్టమి రోజైన మంగళవారం శ్రీదుర్గాదేవిగా విజయవాడ శ్రీకనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిదైన దుర్గారూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను కనులవిందుగా వీక్షించి తన్మయత్వం చెందారు. ఆయురారోగ్యాలను ప్రసాదించే దివ్యరూపిణి దుర్గమ్మను శరణువేడుకున్నారు. రాత్రి ఏడు గంటలకు లక్ష మంది వరకు భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలి వస్తున్నారు. కనకదుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దశమి గడియలు దగ్గర పడుతుండడంతో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి భవానీల రాక పెరిగింది. అమ్మవారిని రాత్రి ఏడు గంటల సమయానికి 1,05,972 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 32,006 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వినాయకుడి ఆలయం నుంచి కెనాల్ రోడ్డు వరకు క్యూలైన్లు ఖాళీగా కనిపించాయి. అక్కడి నుంచి ఇంద్రకీలాద్రి వరకు మొత్తం క్యూ లైన్లలో భక్తుల రద్దీ కనిపించింది. క్యూల్లో ఉన్న భక్తులు జై భవానీ నినాదాలు చేస్తూ ప్రధానాలయం వద్దకు చేరుకున్నారు.
తొమ్మిది రోజులు.. 10 లక్షల మంది
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇప్పటి వరకు 10,81,190 మంది భక్తులు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబరు 22వ తేదీ నుంచి మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మూలా నక్షత్రం రోజున ఆలయం మూసివేసే సమయానికి 1,94,097 మంది భక్తులు సరస్వతీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. 22న 84,417 మంది, 23న 90,190 మంది, 24న 1,00,110 మంది, 25న 1,30,846 మంది, 26న 1,25,486 మంది, 27న 1,21,690 మంది, 28న 1,28,382 మంది, 29న 1,94,097 మంది అమ్మవారిని వివిధ అలంకారాల్లో దర్శనం చేసుకున్నారు. మంగళవారం 1,05,972 మందికి అమ్మవారు దర్శనం ఇచ్చారు. మొత్తం ఇప్పటి వరకు 10,81,190 మంది కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అన్న ప్రసాదాన్ని 2,70,791 మంది స్వీకరించారు. తొమ్మిది రోజుల్లో మూలా నక్షత్రం రోజున అధిక సంఖ్యలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కాగా, బుధవారం అమ్మవారు మహిషాసురమర్దినిగా దర్శనం ఇవ్వనున్నారు.