Shipbuilding Cluster: దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ క్లస్టర్
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:43 AM
రాష్ట్ర ప్రభుత్వం నౌకా నిర్మాణ రంగంలో మరో అడుగు ముందుకేసింది. తిరుపతి జిల్లా దుగరాజ పట్నం సమీపాన 2,000 ఎకరాల్లో షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు గుజరాత్‌లోని భావనగర్‌లో....
2,000 ఎకరాల్లో ఏర్పాటుకు గుజరాత్‌లో ఎంవోయూ
విశాఖపట్నం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నౌకా నిర్మాణ రంగంలో మరో అడుగు ముందుకేసింది. తిరుపతి జిల్లా దుగరాజ పట్నం సమీపాన 2,000 ఎకరాల్లో షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు గుజరాత్‌లోని భావనగర్‌లో శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం నౌకా నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించడంతో గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందుకువచ్చాయి. ఈ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఏపీఐఐసీ ద్వారా సమకూర్చడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ భూముల విలువ రూ.750 కోట్లు. ఈ ప్రాంతంలో పోర్టు నిర్మించడానికి విశాఖపట్నం పోర్టు అథారిటీ అంగీకారం తెలిపింది. దీనికి అవసరమయ్యే పెట్టుబడి సుమారు రూ.4,000 కోట్లు పోర్టు సమకూరుస్తుంది. ఈ క్లస్టర్‌లో ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా నౌకా నిర్మాణం ప్రారంభిస్తారు. దశల వారీగా సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. కాగా, భావనగర్‌లో కొత్తగా నిర్మించిన పోర్టును ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనున్నారు.