DSC Merit List: డీఎస్సీలో మెరిట్ లిస్ట్ విడుదల
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:18 AM
మెగా డీఎస్సీ 2025పై పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాల విడుదల విషయంలోనూ...
పారదర్శకతకు విద్యాశాఖ పెద్దపీట
జాబితాల విడుదలపై నేడు ప్రకటన
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025పై పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాల విడుదల విషయంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌లు విడుదల చేయనుంది. తొలుత ఈ జాబితాలు వెల్లడించకుండా.. నేరుగా ‘ఎంపిక జాబితా’ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై అభ్యర్థుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా, మెరిట్ జాబితా లేకుండా ఎంపిక జాబితాలు ప్రకటిస్తే అనేక అనుమానాలు తెరమీదికి వస్తాయి. గతంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల విషయంలో మెరిట్ జాబితాలు లేకుండా నేరుగా ఉద్యోగాలకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు. అప్పట్లో ఈ విధానంపై విమర్శలు వచ్చాయి. జిల్లాల వారీగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారనే మెరిట్ జాబితా లేకపోతే తమకంటే ఎవరు ముందున్నారు, ఎవరు వెనుక ఉన్నారనే వివరాలు అభ్యర్థులు తెలుసుకోలేరు. ఈ నేపథ్యంలో డీఎస్సీలో మెరిట్ లిస్ట్ విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు. అయితే, ఆ జాబితాలు ఎప్పుడు ఇస్తారు?. సర్టిఫికెట్ల పరిశీలన జాబితాలు ఎప్పటి నుంచి?. అనే విషయాలపై గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేయనుంది.