DSC Convener MV Krishna Reddy: నేడు డీఎస్సీ కాల్‌లెటర్లు
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:50 AM
మెగా డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు మంగళవారం కాల్ లెటర్లు విడుదల చేస్తామని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఎల్లుండి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
ఈలోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి
డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ప్రకటన
2 జిల్లాల్లో సాంకేతిక సమస్యలతో ఆలస్యం
అమరావతి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు మంగళవారం కాల్ లెటర్లు విడుదల చేస్తామని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం నుంచి ఏపీడీఎస్సీ వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్ ద్వారా వ్యక్తిగతంగా కూడా సమాచారం పంపనున్నారు. ఈనెల 28న ఉదయం 9 గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని కృష్ణారెడ్డి తెలిపారు. ఈలోగా అభ్యర్థులు ఏపీడీఎస్సీ వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్ ద్వారా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇటీవల జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), అంగ వైకల్య ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), కాల్‌లెటర్‌లో పేర్కొన్న ఇతర సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పరిశీలనకు హాజరు కావాలన్నారు. కేటాయించిన తేదీ, సమయంలో తప్పనిసరిగా సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలన్నారు. హాజరు కాని, అర్హత లేని వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారని, మెరిట్ జాబితాలోని తర్వాత అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారని వివరించారు. కాగా, సోమవారం కాల్ లెటర్లు అందుతాయని అభ్యర్థులు ఎదురుచూశారు. ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చినా రెండు జిల్లాల జాబితాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విడుదల ఆగిపోయింది.
చెప్పుడు మాటలు విని నష్టపోవద్దు
డీఎస్సీ అభ్యర్థులకు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సూచన
అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందుతున్నవారు చెప్పుడు మాటలు విని నష్టపోవద్దని, న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవద్దని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ ఉత్తీర్ణులకు నష్టం కలిగేలా జగన్, ఆయన అనుచరగణం ప్రయత్నిస్తోందని, అభ్యర్థులను తప్పుదారి పట్టిస్తోందని చెప్పారు. దరఖాస్తు చేసేటప్పుడే ఆలోచించి ఆప్షన్లు పెట్టుకోవాలని నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారన్నారు. నియామకపత్రాలు అందుకునే సమయంలో వైసీపీ ఇలాంటి వాటికి తెరలేపడం సరికాదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం జగన్, ఆయన మీడియాకు కంటగింపుగా మారిందన్నారు.
